అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్, పోలీసు శాఖలకు పరిమితమైన అవినీతి ఇప్పుడు అన్నీ శాఖలకు విస్తరించింది. ఎంతో కొంత ముట్టచెప్పందే ఉద్యోగులు మాట వినని పరిస్థితి ఏర్పడింది. కొన్ని శాఖల్లో 5 పర్సంట్ లంచం తీసుకుంటుండగా మరికొన్ని శాఖల్లో పనినిబట్టి డిమాండ్ చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక శాఖలో సైతం కొందరు అధికారులు బల్లకింద చేతులు పెట్టి సొంత శాఖకు చిక్కుతున్నారు. అయితే ఇప్పటి వరకు లంచం తీసుకుంటే ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగేది దీనికి భిన్నంగా తెలంగాణా ఏసీబీ అధికారులు లంచం అడిగినందుకు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ కొట్టూర్ విజయ్ ఒక కేసులో నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. తదుపరి ఫిర్యాదులు వచ్చినా కేసు నమోదు కాకుండా చూసేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. చివరికి లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. ఏమైందో ఏమో కానీ బాధితుడు ఏసీబీకి సదరు ఎస్సై లంచం అడుగుతున్నాడని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ ఎస్సైని అరెస్టు చేశారు. ఏసీబీ సెక్షన్ 7 ప్రకారం లంచం డిమాండ్ చేయడం కూడా నేరమేనని అధికారులు మీడియాకు తెలిపారు. లంచం తీసుకోకుండా డిమాండ్ చేసిన నేరంపై కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారని సమాచారం.
ఇటీవల తెలంగాణాలో అవినీతి పెచ్చుమీరి పోతుందని జనం చర్చించుకుంటున్నారు. ఏసీబీ వార్షిక రౌండప్ ఆధారంగా వివరాల ప్రకారం….2023 లో 95 కేసులు నమోదయ్యాయి.
2024లో 152 కేసులు నమోదు కాగా
2025లో 199 కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 273 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో 157 ట్రాప్ కేసులు ఉన్నాయి. అంటే ఏ ఏడాదికా ఏడాది కేసులు పెరిగి పోతున్నాయి. అన్నీ శాఖల్లో మ్యామ్యాలు వున్నప్పటికి పోలీస్, రెవెన్యూ లో ముఖ్యంగా భూగర్భ సర్వే, తహసీల్దార్లు, పంచాయతీ రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు మొదటి వరుసలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ దొరికిన దొంగలకు సంబందించినవే దొరకని దొరల లెక్కలు కూడా బయటకు వస్తే గుండెలు గుభేల్ మంటాయి.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్లో ఏసీబీ మెరుపుదాడులు చేసి అనేక మంది లంచం రాయుళ్లను జైలుకు పంపించింది. రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల మీద ఏక కాలంలో దాడులు చేసింది. మున్సిపల్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు జరుపడం సంచలనం కలకలం సృష్టించింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే 1064 నెంబర్కు ఉచితంగా కాల్ చేయవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ నెంబర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది. అంతేకాకుండా ఏపీలో
94404 40057 నెంబర్ వాట్సాప్ కు ఫిర్యాదు చేయవచ్చు. తెలంగాణాలో 9440446106 నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం వుందని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates