ఔను… పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దపడిన ఆయన ఇప్పుడు జగన్ అంటేనే మండిపడుతున్నారు. బీజేపీలో చేరి కూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచిన ఆదినారాయణ ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రచారానికి పులివెందులకు వచ్చారు. బీ టెక్ రవితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సెంటర్లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ…జగన్ చొక్కా మడత పెడతామని సినిమా డైలాగులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అలాగైతే మేము కూడా మోచేతి వరకు చొక్కా మడత పెట్టగలమని కామెంట్ చేశారు. ఆయన సినిమా డైలాగులు చెబుతున్నాడు, మేము అతడికి ఏకంగా సినిమా చూపించడానికే వచ్చాం అని స్పష్టం చేశారు. పులివెందులకు ఊరికే రాలేదని, పక్కా ప్లాన్ తోనే ఇక్కడ అడుగు పెట్టామని చెప్పారు. ఆయనకు చెక్ పెట్టే తీరుతామని కుండబద్దలు కొట్టారు.
ఎమ్మెల్యే ఆదినారాయణ మాస్ వార్నింగ్ ఇవ్వగా పులివెందుల టీడీపీ ఇంచార్జి బీ టెక్ రవి జగన్ మీద విరుచుకొనిపడ్డారు. నన్ను చంపాలని ప్రయత్నం చేసినా జగన్ కు భయపడేది లేదని, వెనకంజ వేసేది లేదని తేల్చి చెప్పారు. తాను తప్పు చేస్తున్నట్లు పులివెందుల ప్రజలు చెబితే ఎన్నికలను వొదిలిపెట్టి వెళ్లిపోతానని చెప్పారు. వైయస్ కుటుంబం గత 40 ఏళ్లుగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తుందన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవంగా టీడీపీ విజయం సాధించిందని, మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా ప్రజల మద్దతుతో గెలుచుకుంటామని చెప్పారు. టీడీపీ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి పులివెందుల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటం గమనార్హం. దీంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates