జనసేన – బీజేపీ అంతర్గత పొత్తు?

తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తెలంగాణ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ పోరులో ఒక స్థానానికి జ‌న‌సేన పార్టీ పోటీకి రెడీ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వైద్య శాఖ మాజీ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస్‌ను ఈ స్థానం నుంచి పోటీకి నిల‌బెడుతున్నార‌ని కూడా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ ప‌రిధిలోకి వ‌చ్చే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జ‌నసేన పోటీ చేయాల‌ని భావిస్తోంది. అయితే.. ఒంట‌రిగా పోటీ చేస్తుందా? లేక‌.. మిత్ర‌ప‌క్షం బీజేపీతో క‌లిసి ముందుకు సాగుతుందా? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి.. బీజేపీకి ఈ ప‌రిణామం సంక‌టంగా మారింది. జ‌న‌సేన‌తో పొత్తు కొన‌సాగించాల‌నేది బీజేపీ వ్యూహం. గ‌త 2024 ఏపీ ఎన్నిక‌ల్లో బీజేపీ.. జ‌న‌సేనతో క‌లిసి పోటీ చేసింది. త‌ద్వారా కేంద్రంలోనూ ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టింది.

సో.. ఈ ప్రాతిప‌దిక‌న‌.. తెలంగాణ‌లో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌న‌సేన కోరుతోంది. కానీ, తెలంగాణ‌కు, ఏపీకి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితే.. ఆంధ్ర‌ అనే ముద్ర ప‌డే అవ‌కాశం ఉంది. అలాగ‌ని జ‌న‌సేన‌ను వ‌దిలించుకునే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో అంత‌ర్గ‌త పొత్తుకు బీజేపీ నేత‌లు రెడీ అయ్యార‌ని, దీనికి జ‌న‌సేన కూడా సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. అంటే.. ఎమ్మెల్సీ స్థానానికి జ‌న‌సేన త‌ర‌ఫున అభ్య‌ర్థిలో బ‌రిలో ఉంటారు. ఆ స్థానంలో బీజేపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌దు.

గ‌డ‌ల‌కు మ‌ద్ద‌తు.. !

గ‌డల శ్రీనివాస‌రావు పేరును జ‌న‌సేన ఖ‌రారు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు బీజేపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించనుంది. దీంతో ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఈ ప‌రిణామం బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండాముందుకు తీసుకువెళ్లాల‌ని బీజేపీ కోరుతోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీ గుర్తులతో సంబంధం ఉండ‌దు కాబ‌ట్టి.. వ్యక్తుల ఇమేజ్, ఓటు బ్యాంక్ నెట్‌వర్క్ వంటి వాటి విష‌యంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరింద‌ని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ‌లో జ‌న‌సేన ఎమ్మెల్సీ స్థానానికి బ‌రిలో నిల‌వ‌డం ఇదే తొలిసారి.