ఏకగ్రీవాలతో కూటమి పార్టీల హై హై

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో కూటమి పార్టీలు ఏకగ్రీవంతో పైచేయి సాధించాయి. వైసీపీ అధినేత సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పులివెందులలోనే కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో దాని ప్రభావం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించినట్టయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవమయ్యాయి. 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవమైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెలుగుదేశం 15, బీజేపీ, జనసేన ఒక్కో స్థానంలో ఏకగ్రీవమైంది. పులివెందులలో జనసేన బోణి కొట్టింది.

పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలను, తొండూరు మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలను, సింహాద్రిపురం మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలను, వేముల మండలంలోని 8 ఎంపీటీసీల్లో, చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాల్లో, లింగాల మండలంలోని 9 ఎంపీటీసీల్లో టీడీపీ జెండా ఎగరేసింది.

ప్రొద్దుటూరులో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 20 మంది టీడీపీ, ముగ్గురు జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మొత్తం 57 ఎంపీటీసీ స్థానాలు, పిడుగురాళ్లలో మొత్తం 18 స్థానాలు, మాచవరంలో మొత్తం 15 స్థానాలు , గురజాల మండలంలో మొత్తం 12, దాచేపల్లిలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పెదకూరపాడు, పుంగనూరు నియోజకవర్గాల్లో కూడా ఇదే హవా కనిపించింది. జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగింది. కడప, చిత్తూరు, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి, దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకవైపు కూటమి పార్టీలు ఏకగ్రీవంగా విజయాలు సాధిస్తూ ఊపు మీద వుంటే మరోవైపు ఎన్నికలను ఎదుర్కోలేక వైసీపీ రకరకాలుగా ఆరోపణలు చేస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు.