రాజకీయం అంటే ఇంతే!.. ఊహించని పరిణామాలు జరగడమే అసలైన రాజకీయం. ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కడా ఏకగ్రీవాలు కారాదని.. ఎక్కడా పోటీ లేకుండా కూటమి నాయకులు విజయం దక్కించుకోరాదని చెప్పిన వైసీపీ అధినేత జగన్‌కు ఆయన సొంత ఇలాకా కడపలోని సొంత నియోజకవర్గం పులివెందులలోనే భారీ షాక్ తగిలింది. బహుశ జగన్ కూడా ఊహించి ఉండనంత రేంజ్‌లో ఇక్కడ కూటమి పార్టీలు పక్కా విజయం నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్‌కు కూడా కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ తాజా స్థానిక ఎన్నికల్లో జయభేరి మోగించింది.
పులివెందుల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. నిజానికి మునిసిపల్ ఎన్నికల్లోనే ఏకగ్రీవాలు జరగరాదని.. గట్టి పోటీ ఇవ్వాలని జగన్ పదే పదే చెప్పుకొచ్చారు. అలాంటిది.. ఏకంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాల్లోనే ఏకగ్రీవాలు కావడం వైసీపీకి మరీ ముఖ్యంగా జగన్‌కు భారీ సవాల్ రువ్వినట్టు అయింది.
పులి వెందుల అంటేనే జగన్‌కు మరోపేరు!. అలాంటి చోట తాజాగా ఏకగ్రీవాలు జరగడం.. వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన వారు కూడా వెనక్కి తగ్గడం.. అదే సమయంలో కొందరి నామినేషన్లు తిరస్కరణలకు గురికావడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించినట్టు అయింది.
ఎన్నెన్ని..
మొత్తం ఎంపీటీసీలు: 65
టీడీపీ ఏకగ్రీవం చేసుకున్న స్థానాలు: 64
మొత్తం జెడ్పీటీసీలు: 7
టీడీపీ ఏకగ్రీవం చేసుకున్నస్థానాలు: 3
నిజంగానే దెబ్బ!
వాస్తవానికి పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబాలే చాలా వరకు ఉన్నాయని అంటారు. ఆయాకుటుంబాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. అయితే.. నామినేషన్ల తిరస్కరణ పెద్ద అడ్డంకిగా మారింది.మరోవైపు… జగన్ వైఖరిపైనా స్థానికంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ తరఫున నామినేషన్లు వేసేవారు కూడా ముందుకు రాలేదు. దీంతో టీడీపీకి ఏకగ్రీవాలు సాకారం అయినట్టు తెలుస్తోంది. సుమారు 40 ఏళ్లలో టీడీపీ ఇక్కడ ఇన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఖచ్చితంగా రికార్డేనని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates