ప్రస్తుతం విశాఖపట్నానికి చేరువగా ఉన్న అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏపీలోని తీర ప్రాంత జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత.. ఈతుఫాను వేగం పెరగడంతోపాటు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ తుఫాను ప్రభావంపై సమీక్షించారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తుఫాన్ సన్నద్ధతపై సమీక్ష చేస్తూనే ఉన్నారు. అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు, అధికారులకు కూడా కొన్ని కీలక సూచనలు చేశారు.
తుఫాను కారణంగా.. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆర్నబ్ తుపాను రెడ్ కేటగిరీలో ఉంది. అయినా ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుంది. పశ్చిమగోదావరి, కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకూ ఎక్కువ వర్షాలు, గాలుల తీవ్రత ఉంటుంది. కాకినాడ సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. తుఫాన్ ప్రభావంతో వర్షాలు ఈ ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రికి, బుధవారం కూడా వర్షపాతం తీరప్రాంతాల్లో నమోదు అవుతుంది. కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని చంద్రబాబు వివరించారు.
కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. తీర ప్రాంతజిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నట్టు చెప్పారు. సముద్ర తీరగ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని, తుఫాన్ ప్రభావంతో ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో 290 షెల్టర్లను ఏర్పాటు చేశామన్నారు. 84,396 మందిని షెల్టర్లకు తరలించామని వివరించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మత్స్యకారులకు చెందిన 30 వేల పైచిలుకు బోట్లను సముద్రం నుంచి వెనక్కు రప్పించామన్నారు. ఒడిశాలోని గోపాల్ పూర్‌లో కూడా ఏపీకి చెందిన 93 బోట్లు వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. వైద్య చికిత్సల కోసం 1,316 అంబులెన్సులు సిద్ధం చేశామని, 5 వేల మంది గర్భిణులను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సమీప ఆస్పత్రులకు తరలించామని వివరించారు. విద్యుత్ అంతరాయం వస్తే తక్షణం స్పందించేందుకు 8,400 మందిని సిద్ధం చేసుకున్నామని తెలిపారు.
తుపాను ప్రభావంతో 15 వేల వరకూ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను కారణంగా కురిసే భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వివిధ జిల్లాల్లో వాగులు వంకల్లో వరద నీటి ప్రవాహాలను అంచనా వేయటంతో పాటు చెరువులకు గండ్లు పడినా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. 7.16 లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు, 16 లక్షల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు.
తుఫాను కారణంగా నష్ట ప్రభావాన్ని సాంకేతికత ఆధారంగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టామని సీఎం పేర్కొన్నారు. గతంలో బుడమేరు వరద సమయంలో నేను విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించాను. ప్రజలు దాదాపు రూ.5 వందల కోట్ల మేర విరాళాలు కూడా ఇచ్చారు. ప్రాణ, ఆస్తినష్టం వీలైనంత మేర తగ్గించటమే లక్ష్యంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు మరింత సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తీవ్ర తుపానుపై ఇవాళ రాత్రి కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates