జైలు నుంచి పారిపోయి డ్రోన్లకు చిక్కారు

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఖైదీలు జంప్ కావడం రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే పాలనలో జైళ్ల నుంచి ఖైదీలు పారిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి స్థాలిన్ మండిపడ్డారు.

తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలులో సోమవారం రాత్రి కొంతమంది ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేశారు. సినిమా నటుల్లా తమకు ఆరోగ్యం బాగా లేదని నటించారు. వారిలో ఒక ఖైదీ మూర్చ వచ్చినట్టు కిందపడి కొట్టుకోసాగాడు. దాంతో అయ్యో పాపం అంటూ సాయం చేసేందుకు సెక్యూరిటీ గార్డు దగ్గరకు వచ్చాడు. వెంటనే అతడి మీద దాడికి పాల్పడ్డారు. అతడు తేరుకునేలోపే జైలు నుంచి పరారయ్యారు.

ఖైదీల్లో అత్యధికులు విలుప్పురం జిల్లాకు చెందినవారిగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. పారిపోయిన ఖైదీలు అటవీ ప్రాంతంలో దాక్కున్నారన్న సమాచారంతో డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. 13 మందిని పట్టుకొని కోటింగ్ ఇచ్చి ఊచల వెనక్కి నెట్టారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. తేని జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్‌పాయింట్లు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అలాగే జైలులో భద్రతాలోపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దిండిగుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.జయకుమార్ అన్నీ కోణాలలో పరిశీలన చేస్తున్నారు. తేనికి, విలుప్పురం ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామని, పారిపోయిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జయకుమార్ తెలిపారు. జైలు సిబ్బంది పాత్ర ఏమైనా వుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఈ నిర్లక్ష్యానికి కారణమైన జైలు సిబ్బంది తొమ్మిది మందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఖైదీల పరారీ మీద మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. తెక్కడంపట్టి సబ్‌ జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు పరారవక ముందు చెన్నై శివార్లలోని పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పోయారని గుర్తు చేశారు. జైళ్లలో సెక్యూరిటీ గార్డులను కొట్టి ఖైదీలు పారిపోతుంటే విజయ్ ప్రభుత్వంపై ఏమీ చేయలేక చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో ఖైదీల పరారీ విషయం విజయ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.