ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ లను కూటమి పార్టీల నేతలు, పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారని వైసీపీ విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కోర్టును కూడా ఆశ్రయించారు. అయినా సరే కొన్ని చోట్ల ఇంకా వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీల నేతలకు మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సారి జగన్ కూడా బూతులోకి వెళ్లి ఓటు వేస్తాడని, అన్యాయం చేయడానికి ముందుకు వస్తారా.. రండి అంటూ జగన్ సవాల్ విసిరారు. స్లీవ్ ఎలాగూ మడిచామని, రండి ఎంత మంది వస్తారో రండి.. అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ సారి గట్టిగా తగులుదాం అంటూ వైసీపీ క్యాడర్ లో జగన్ జోష్ నింపారు. ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో… ప్రజలు వాళ్ల వెంట ఉంటారని నిరూపిద్దాం అంటూ జగన్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మాట్లాడారు.
అన్యాయం చేసిన ప్రతి పోలీసు అధికారికి, ప్రభుత్వ అధికారులకు చెబుతున్నానని, రిటైర్ అయినా తీసుకువస్తానని..ఎక్కడికీ పోలేరని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు కోసం డ్యూటీ చేయడం సరికాదని, టోపీ మీద ఉన్న మూడు సింహాలను గుర్తు తెచ్చుకోవాలని పోలీసులకు హితవు పలికారు. రాజ్యాంగబద్దంగా డ్యూటీ చేయాలని..ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రక్షకులే దౌర్జన్యం చేస్తే..ఇక రక్షించేదెవరు అని జగన్ ప్రశ్నించారు.
పులివెందులలో తన వాళ్ల మీద చేయి వేశారంటే తన మీద చేయి వేసినట్లే అర్థం అని జగన్ అన్నారు. ‘‘టైం మీది…చేయి వేస్తున్నారు..మా టైం వస్తుంది..వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై జగన్ 2.0 చూస్తారని అన్నారు. ‘ఆ చొక్కాను మడతబెట్టి’..అనే రేంజ్ లో కూటమికి జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates