తమిళ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ఇటీవల విపరీతంగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయన్నున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీకి సంబందించి రకరకాల పేర్లు కూడా ప్రచారంలో వున్నాయి. అభిమాన సంఘాలు మరింత క్రియాశీలమయ్యాయి. అయితే ధనుష్ రాజకీయ పార్టీ ఏర్పాటు వెనక బీజేపీ పెద్దలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
దీపావళిని పురస్కరించుకుని తన అభిమాన సంఘం.. ‘నర్పణి ఇయక్కమ్’ ఆధ్వర్యంలో మహిళా విభాగం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారికి వెండి ‘కామాక్షి’ దీపాల ప్రమిదలను కానుకగా ఇచ్చారు. ఈ ప్రమిదల కింది భాగంలో కమలం పువ్వును ముద్రించి ఉండటం చర్చకు దారితీసింది. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కావడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ధనుష్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కమలం ప్రమిదలను పంపిణీ చేయడం ఒక సంకేతంగా భావిస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా నటుడు విజయ్ పార్టీ టీవీకే అధికారంలోకి రావడంతో సినిమా హీరోల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తామెందుకు ముఖ్యమంత్రి కాలేమని కొందరు నటులు ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆయా హీరోల అభిమానులు కూడా హడావుడి స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ధనుష్ ” తమిళగ ఎళుచ్చి కళగం ” పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఒక హడావుడి మాత్రం కనిపిస్తుంది.
ఇటీవల అభిమాన సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించిన ధనుష్ కొత్త జెండా ఆవిష్కరించారు. ధనుష్ ‘నర్పణి మండ్రం’ పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కంగా మార్చారు. ఈ బ్యానర్ కింద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రజనీకాంత్ భార్య బీజేపీ నాయకులను కలవడం జరిగింది.. ఆమె రాజ్యసభ సీటు కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates