దేశంలో చాలామంది న్యాయమూర్తులు వున్నారు. వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళ పేర్లే ప్రజలకు తెలుసు. కానీ రవికుమార్ దివాకర్ అంటే మాత్రం తెలియని వారుండరు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పేరు వింటేనే చాలు కొందరు నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. అందుకు కారణం ఆయన ఇచ్చిన తీర్పులే. కేవలం 11 నెలల్లో 23 మందికి మరణ శిక్షలు విధించారంటే ఆయన ఆషామాషీ న్యాయమూర్తి కాదని తెలిసిపోతుంది.
రవి కుమార్ దివాకర్…ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా పనిస్తున్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కేవలం ఆరు నెలల్లో 11 కేసుల్లో 23 మంది నిందితులకు మరణశిక్ష విధించారు. హత్యలు, వరకట్న వేధింపుల వల్ల భార్యను సజీవ దహనం చేయడం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులలో ఆయన ఈ కఠిన శిక్షలు ఖరారు చేశారు. బరేలీ కోర్టులో పనిచేసినప్పుడు కూడా 13 మందికి మరణశిక్షలు విధించారు. దీనితో ఆయన తన కెరీర్లో మొత్తం 36 మరణశిక్షలు విధించినట్లయింది.
ఆయన దగ్గరికి కేసు వెడితే చాలు తాడోపేడో అన్నట్లు ఉండటంతో ఆయనను ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రవికుమార్‌ను ముజఫర్ నగర్ ఫ్యామిలీ కోర్టుకు అదనపు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు శివ కుమారి బాధ్యతలు అప్పగించారు.
ఇది రవికుమార్ కు ఆగ్రహం తెప్పించింది. అందుకు కారణం ఇప్పుడాయన బెంచ్ మీద 97 కేసులున్నాయి. ఇవన్నీ తీవ్రమైన నేరాలకు సంబందించినవే కావడం గమనార్హం.
అయితే ఈ ఏడాది ఆగస్టులో అప్పటి జిల్లా సెషన్స్ జడ్జి బి.కె. సింగ్ ఒక పరిపాలనా ఉత్తర్వు ద్వారా న్యాయమూర్తి రవి కుమార్ కోర్టులో విచారణ సాగుతున్న సుమారు 97 హత్య, ఇతర తీవ్రమైన నేరాల కేసులను వేరే కోర్టులకు బదిలీ చేశారు. విచారణ సగం పూర్తయిన కేసులను చట్టబద్ద ప్రక్రియ పాటించకుండా అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడంపై రవికుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయడం న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఒక కేసుకు సంబందించి ఇచ్చిన తీర్పు సందర్బంగా న్యాయమూర్తి రవికుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఒక పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావడమే మేలు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం న్యాయ సూత్రాలకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అందుకే రవికుమార్ గురించి ఇప్పుడు దేశం చర్చించుకుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates