కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయడానికి, రాజకీయంగా అంతం చేయడానికి డీకే భారీ కుట్రకు తెరలేపారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకోసం 600 కోట్లు సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లింగ్ కు ప్లాన్ చేశారని కుమారస్వామి చేసిన ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డీకే ఎన్నో కుట్రలు చేశారని, వాటిలో ఇది ఒకటని కుమార స్వామి ఆరోపించారు.
కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా జరిగిన స్టింగ్ ఆపరేషన్ పై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కుమార స్వామి చేసిన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. జర్నలిస్ట్ రాకేష్ శెట్టి, కాంగ్రెస్ నాయకురాలు కృపా అల్వా, వారి అనుచరులు కలిసి సిద్ద రామయ్యకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారని కుమార స్వామి ఆరోపించారు.
ఆ స్టింగ్ ఆపరేషన్ లో లభించిన కొన్ని రికార్డింగులను అడ్డుపెట్టుకొని సిద్ధరామయ్యను బ్లాక్ మెయిల్ చేసి పదవి నుంచి తొలగించి డీకేను ఆ స్థానంలో కూర్చోబెట్టారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు, సీఎం డీకే ఖండించారు.
కాగా, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందకు డీకే సర్కార్ ఈ స్టింగ్ ఆపరేషన్ డ్రామాను తెరపైకి తెచ్చిందని కుమారస్వామి విమర్శించారు. స్టింగ్ ఆపరేషన్ విచారణలో 80 శాతం పూర్తయిందని, కానీ, కేపీఎస్సీ కుంభకోణం విచారణ 90 శాతం కప్పిపుచ్చారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను జేడీఎస్ వైపునకు మళ్లిస్తోందని మండిపడ్డారు. ఈ ‘స్టింగ్ ఆపరేషన్’ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates