బతికితే బాలయ్యలా బతకాలి

నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ ఎక్కువ ఆలోచించకుండా తనకు నచ్చింది చేసుకుపోతారని అంటారు సన్నిహితులు. అభిమానులతో దురుసుగా ప్రవర్తిస్తాడని బాలయ్య మీద వచ్చే విమర్శలను కూడా వాళ్లు తిప్పికొడుతుంటారు. బాలయ్యతో మంచి అనుబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా బాలయ్య గురించి ఇలాగే మాట్లాడాడు.

‘‘బతికితే బాలయ్యలా బతకాలి’’ అంటూ నందమూరి హీరో గురించి ఎలివేషన్ ఇచ్చాడు వాసు. ‘గుల్టే’ ఇంటర్వ్యూలో బాలయ్య గురించి వాసు చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘ఒకసారి అసెంబ్లీలో బాలయ్య బాబు గారితో ఆయన నటించిన ఒక సినిమా గురించి ఒక మాట అన్నా. ఆ మూవీ అలా చేయకుండా ఉండాల్సింది కదన్నా అన్నాను. ‘కదా నేనూ అనుకుంటూ ఉంటానురా’ అన్నారు. ఆ సినిమా ఏదో చెప్పలేను. ఇప్పుడు నేనా సినిమా గురించి చెబితే.. ఒకసారి ఫోన్ చేసి రామ్మా అంటారు. బాలయ్య గారు గొప్ప మనిషి. కొంతమంది ఒక స్థాయికి రాగానే నేను ఎమ్మెల్యేని, మంత్రిని. అందరూ చూస్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. తినేటపుడు స్పూన్‌తో తినాలి, మితంగా తినాలి అనుకుంటారు. కానీ బాలయ్య అలా కాదు. ఆయన స్పూన్ వాడరు. చేత్తోనే తింటారు. ఎంత కావాలంటే అంత తింటారు. మనం స్పూన్‌త తింటుంటే.. దేవుడు మనకు చెయ్యి ఇచ్చింది ఎందుకురా అంటారు.

ఆయన రసం వేసుకుని అన్నం తిని.. చివర్లో ప్లేటు పైకెత్తుకుని ఆ రసం తాగుతారు. అందుకే నేను బాలయ్య బాబులా బతకాలి అంటాను. ఆయన అనుకున్నది చేస్తారు. కొందరికి ఆయన ప్రవర్తన ఇబ్బందిగా ఉండొచ్చు. నొచ్చుకోవచ్చు. కానీ ఆయన నచ్చినట్లు తింటున్నారు. నచ్చినట్లు తాగుతారు. నచ్చినట్లు బతుకుతారు. అభిమానుల మీద చేయి చేసుకుంటాడని కొందరంటారు. కానీ ఫ్యాన్స్ అలా ఫీలవ్వరు. ఆయన చెయ్య టచ్ అయిందని అనుకుంటారు’’ అని ఆదిరెడ్డి వాసు వివరించారు.