ఈసారి పుష్కరాల్లో అలాంటి పొరపాట్లు జరగవు: రాజమండ్రి MLA

2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అప్పట్లో పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 29 మంది భక్తులు మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. పుణ్య ఘడియల సమయం మించిపోతోందంటూ భక్తులంతా ఒకే ఘాట్‌కు పోటెత్తడం, ఇతర ప్రత్యామ్నాయ ఘాట్ల గురించి సరైన సమాచారం లేకపోవడం నేపథ్యంలో స్నానాలు చేసి బయటకు వస్తున్న భక్తులు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భక్తుల మధ్య తోపులాట ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. కారణాలేవైనా ఆ ఘటన వల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది.

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జూన్ లో మొదలు కాబోతున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జూన్ 26, 2027 నుండి జూలై 7, 2027 వరకు 12 రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ పుష్కరాలను ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్మాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేసి, అందుకు తగినట్లుగా ఘాట్లు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు.

2019లో టీడీపీ ఓటమికి అనేక కారణాలున్నాయని, వాటిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన కూడా ఒకటని జరుగుతున్న ప్రచారంపై ఆదిరెడ్డి వాసు స్పందించారు. ఆ రోజు ఆ పుష్కర ఘాట్ కు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందని, ఒకేసారి చాలామంది భక్తులు ఈ ఘాట్ కు వచ్చారని వాసు అన్నారు. అంతేకాకుండా, వివిధ శాఖల మద్య సమన్వయం లేదని, పుణ్య ఘడియలు అనగానే ఒక్కసారి జనం అక్కడకి వచ్చారని తెలిపారు. ఆ ఘాట్ సమీపంలో కాంక్రీట్ నిర్మాణం ఉంటుందని, లోపల ఏం జరుగుతుందో తెలిసే లోపే నష్టం జరిగిపోయిందని అన్నారు.

అయితే, భద్రతాపరమైన ఏర్పాట్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటామని, ఈ సారి టెక్నాలజీ సాయంతో గతంలో జరిగిన ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పారు. టెక్నాలజీ అప్డేట్ విషయంలో తమ నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ సారి పుష్కరాలలో ప్రతి ఘాట్ ను ఒక క్లస్టర్ గా తీసుకుంటామని, ఆ ఘాట్ కెపాసిటీ ఎంత, ఎంతమంది స్నానం చేయగలరు వంటి విషయాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామని చెప్పారు. ఒక ఘాట్ కెపాసిటీ 1000 మంది అనుకుంటే ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో 1000 మంది ఆ ఘాట్ లో నిండగానే అలర్ట్ స్క్రీన్ మీద వస్తుందని చెప్పారు.

ఆ స్క్రీన్ ద్వారా పోలీసులు భక్తులను మానిటర్, కంట్రోల్ చేస్తారని, ప్రజలు కూడా స్క్రీన్ లు చూసుకొని రద్దీని బట్టి వెళ్లాలని సూచించారు. రైల్వే స్టేషన్ లలో కూడా భక్తుల తాకిడిని కంట్రోల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పుష్కర ఘాట్ కు సమీపంలోని గ్రామాల్లో కూడా పుష్కర విలేజ్ లలో స్నానం ఆచరించేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్కడ కూడా జనం ఫుల్ అయితే ఒక చోట వారికి బస ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్కక్రమాలు పెట్టి వారు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత మెయిన్ ఘాట్ లు ఖాళీ అయిన తర్వాత స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.