నేత‌ల వైఖ‌రితో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రితో నేత‌లు..

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుంద‌న్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా చూస్తే.. పార్టీలు స‌త‌మ‌తం అవుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలలో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే.. చిత్రంగా టీడీపీలో నేత‌ల వైఖ‌రి కార‌ణంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ఇరుకున కూడా ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వస్తే.. క్షేత్ర‌స్థాయినాయ‌కులు బాగానే ఉన్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగా వారు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ రెండు విష‌యాలు ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారాయి.

టీడీపీ విష‌యానికి వ‌స్తే..

పార్టీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రికి భిన్నంగా క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో కూట‌మి పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లో కూడా టీడీపీ నాయ‌కులు పోటీకి దిగారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, క‌ర్నూలు, అనంత‌పురం వంటి కీల‌క జిల్లాల్లో రెబ‌ల్స్‌గా త‌మ్ముళ్లు నామినేష‌న్ వేశారు.. ఇక‌, ఎంపీటీసీ జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో కూడా.. ఎమ్మెల్యేలే స్వ‌యంగా ఇష్టాను సారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రి నుంచి ముడుపులు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. కానీ, ఇవేవీ జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని.. అంద‌రూ పార్టీ అధిష్టానం మాట వినాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కాగా, కొంద‌రు మాట వింటుంటే.. మ‌రికొంద‌రు పెడ‌చెవిన పెడుతున్నారు. సో.. నాయ‌కుల వైఖ‌రితో చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు.

వైసీపీ విష‌యానికి వ‌స్తే..

క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న‌ది పెద్ద ఎత్తున జ‌రుగుతున్న చ‌ర్చ‌. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మావిగ‌న్ ప్ర‌క‌ట‌న‌తో చాలా మంది నాయ‌కులు విభేదించారు. ఆ త‌ర్వాత ష‌ర్మిల వ్య‌వ‌హారంతోపాటు.. ర‌ప్పా రప్పా బ్యాచ్‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి వైసీపీలోని కొంద‌రు త‌ట‌స్థులు, సీనియ‌ర్ల‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. ఇక‌, తాజాగా త‌న సోద‌రి కుమార్తె అంజలి వివాహానికి బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌ను ఇచ్చే విష‌యంలోనూ జ‌గ‌న్ అను స‌రిస్తున్న వైఖ‌రి ఆయ‌న‌కు మాత్ర‌మేకాకుండా.. పార్టీకి కూడా డ్యామేజీ తీసుకువ‌స్తుంద‌ని సీనియ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. ఇది పైకి కుటుంబ‌వ్య‌వ‌హార‌మ‌ని అంటున్నా.. సెంటిమెంటు వ్య‌వ‌హారంగా మారి.. రాజ‌కీయంగాబ‌ద్నాం అవుతామ‌ని చెబుతున్నారు.

మొత్తంగా జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి, ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌లేక పోవ‌డం .. ఇంకా త‌ప్పులు చేస్తుండ‌డం వంటివి వైసీపీ నాయ‌కుల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. మా పార్టీకి ఎవ‌రో వ‌చ్చి న‌ష్టం చేయాల్సిన ప‌నిలేదు. మాకు మేమే నాశ‌నం చేసుకునే స‌త్తా మాకు ఉంది, అని క‌ర్నూలుకు చెందిన వైసీపీ వృద్ధ‌నాయ‌కుడు చేసిన వ్యాఖ్య‌ల వెనుక అంత‌రార్థం జ‌గ‌నేన్న‌ది అంద‌రికీ సుస్ప‌ష్ట‌మే. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వైఖ‌రిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌క్తిగతంగా త‌ప్పులు చేయ‌క‌పోయినా.. పార్టీ నాయ‌కుల‌పై చూపుతున్న అపార‌మైన ఉదాసీన‌త ఆయ‌న‌కు క‌ష్టాలు తెచ్చి పెడుతోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.