తెలంగాణ బీజేపీకి కరెక్ట్ ఇంచార్జి దొరికినట్టేనా?

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బన్సల్ .. తొలి ప‌ర్య‌ట‌న‌లోనే నేత‌ల‌ను లైన్‌లో పెట్టే చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేశారు. కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా నియ‌మితుల‌య్యారు. తాజాగా శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ ప‌రంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై సుదీర్ఘ నివేదిక‌ల‌ను తెప్పించుకున్న‌ట్టు తెలిపారు. అంద‌రూ ఏమేం చేస్తున్నారో.. నాకు అంతా తెలుసు. నా ద‌గ్గ‌ర ప‌క్కా స‌మాచారం ఉంది. అని వ్యాఖ్యానించ‌డం ద్వారా.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ప‌ట్టు సాధించిన‌ట్టు అర్థ‌మైంది.

ప్ర‌ధానంగా 3 విష‌యాల‌ను లేవనెత్తిన బ‌న్స‌ల్‌.. బీజేపీ నేత‌ల‌కు క్లాస్ ఇచ్చారు.

1) ఆర్భాటాలు: నాయ‌కులు ఆర్భాటాల‌కు పోతున్నార‌న్నది బ‌న్స‌ల్ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. స‌భ‌లు, స‌మావేశాలు, బ‌హిరంగ కార్య‌క్ర‌మాల‌ను పోటీ ప‌డి నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. అయితే.. దీని వ‌ల్ల పార్టీకి ఒరిగేది పెద్ద‌గా ఏమీ ఉండ‌ద‌ని అన్నారు. ఇది కేవ‌లం నాయ‌కులు త‌మ త‌మ బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే అవ‌కాశం మాత్ర‌మేన‌ని పెద‌వి విరిచారు.

2) ప‌ర్య‌ట‌న‌లు: రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలంటే.. నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని బ‌న్సల్ తేల్చి చెప్పారు.కానీ, అలా జ‌ర‌గ‌డం లేద‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రం అంటే హైద‌రాబాద్ బీజేపీ ఆఫీసు కాదు అని వ్యాఖ్యానించారు.

3) నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌లు: నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌లు కూడా త‌న‌కు తెలుసున‌ని బ‌న్స‌ల్ చెప్పారు. ఇవి అంతిమంగా వారినే కాకుండా పార్టీని కూడా దెబ్బ‌తీస్తాయ‌ని చెప్పారు. ఇలాంటివాటికి నాయ‌కులు త‌క్ష‌ణ‌మే దూరంగా ఉండాల‌న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయ‌కులు ఉండి కూడా పార్టీ ఎందుకు పుంజుకోద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌గినంత శ్ర‌మ చేయ‌డం లేద‌ని.. పైపై మెరుగుల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మీడియాలో క‌నిపించేందుకు మీరు తాప‌త్ర‌య ప‌డుతున్నారు. అలా కాదు.. ప‌నిచేస్తే.. మీడియాలో మీరు ఆటోమేటిక్‌గానే క‌నిపిస్తారు అని బ‌న్స‌ల్ దిశానిర్దేశం చేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డం ఒక్క‌టే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగాల‌న్నారు.

    సునీల్ బ‌న్స‌ల్ ఎవ‌రు

    సునీల్ బన్సల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గ‌త నెల‌లో ఆయనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1990లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో ఆయన వ్యూహకర్తగా కీలక పాత్ర పోషించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో బీజేపీ విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ ఆయ‌న‌కు ఇక్క‌డ ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం.