తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే నీటి వాడకంపై ఆంక్షలు కూడా విధించారు. ఇక, రాబోయే 8 నుంచి 10 నెలల పాటు తీవ్ర కరువు, నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి నగరవాసులను హెచ్చరించారు.
అందుకే, భాగ్యనగర వాసులు సాధ్యమైనంత వరకు నీటి వినియోగం తగ్గించుకోవాలని, ప్రతి ఒక్కరు కనీసం 20 శాతం వాడకం తగ్గించుకుంటే బాగుంటుందని రేవంత్ పిలుపునిచ్చారు. సాగునీటి కంటే తాగునీటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా రేవంత్ చెప్పారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయని, కాబట్టి తెలంగాణలో రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు మాత్రమే సాగు చేయాలని కోరారు. రైతులు కూడా నీటిని అవసరమైన మేర వాడాలని, నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
గత ఏడాదితో పోలిస్తే కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో సాధారణంగా ఉండాల్సిన 462 టీఎంసీలకు బదులుగా కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని వెల్లడించారు. ఇక, ఎల్ నినో అనేది ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఉన్న సమస్య అని, దీనిపై రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రకృతి విపత్తులను మనం ఆపలేమని, కానీ, ముందస్తు జాగ్రత్తల వల్ల వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చని అన్నారు. కరువు పరిస్థితులపై 6 నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమని అన్నారు. వర్షాకాలం అయిన అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేదని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates