కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. చాలా మిత భాషిగా పేరున్న సోనియా గాంధీ సందర్భానుసారంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అటువంటి సోనియా గాంధీ తొలిసారిగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు. తన జీవితంలో ప్రేమ, తీపి-చేదు జ్ఞాపకాలు, రాజకీయాలు వంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీ “బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్” అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఈ ఏడాది నవంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుక్ రిలీజ్ గ్లింప్స్ వీడియోలో తమ లవ్ స్టోరీని రివీల్ చేశారు సోనియా.
1960ల నాటి తమ ప్రేమ ప్రయాణాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ‘వర్సిటీ రెస్టారెంట్’ అనే ఒక గ్రీక్ రెస్టారెంట్లో సోనియా, రాజీవ్ గాంధీ తొలిసారి కలుసుకున్నారు. ఇటలీ వంటకాల కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సోనియాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో పరిచయం ఏర్పడింది. రాజీవ్ తో జీవితాన్ని పంచుకోవాలని తొలిచూపులోనే తనకు అనిపించిందని, రాజీవ్ మనసులో కూడా అదే భావన కలిగిందని సోనియా చెప్పారు.
చక్కని రూపంతో పాటు అత్యంత సున్నితమైన స్వభావం, మృదువైన ప్రవర్తన వల్లే రాజీవ్ గాంధీని ఇష్టపడ్డానని చెప్పారు. ఆ పరిచయం తర్వాత ఇద్దరూ కలిసి స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం, నగరరంలో తిరగడం చేస్తూ మరింత దగ్గరయ్యామని అన్నారు. సుదీర్ఘకాలం ప్రేమించుకున్న తర్వాత 1968 ఫిబ్రవరి 25న వివాహ బంధంతో ఒక్కటయ్యామని చెప్పారు. ఇలా రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ గురించి సోనియా గాంధీ రివీల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, ఆ పుస్తకంలో వీరిద్దరి లవ్ స్టోరీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయని, వాటిని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates