తన మేనకోడలు అంజిలి వివాహాన్ని తన ఉమ్మడి ఆస్తి కాంపౌండ్ లో జరపకూడదని మేనమామ జగన్ అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ విషయం గురించి షర్మిలకు జగన్ ఆల్రెడీ లేఖ రాశారని, అయినప్పటికీ షర్మిల ఎలహంక ప్యాలెస్ లోనే పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తారీకున షర్మిలకు జగన్ రాసిన లేఖను తాజాగా మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో జగన్ పలు విషయాలు ప్రస్తావించారు. అంజిలి పెళ్లికి కావాలంటే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను వాడుకో షర్మి అంటూ తన సోదరి షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంజిలి పెళ్లి వార్త వినగానే తాను సంతోషించానని జగన్ అన్నారు. అంజిలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. కానీ, తన అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ లోనే, తన నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ విషయం తనను బాధించిందని జగన్ అన్నారు. తాను ఉంటున్న ఇంట్లో పెళ్లి జరిగితే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని కొందరు వ్యక్తుల ద్వారా షర్మిలకు తెలియజేశానని, అయినా సరే ఇక్కడే పెళ్లి జరపాలని నిశ్చయించడంతో తనకు బాధ కలిగిందని చెప్పారు.
‘‘పెళ్లికి భారీ సంఖ్యలో అతిధులు, ప్రజలు వస్తారు… క్యాటరింగ్ సిబ్బంది. డెకరేషన్ వాళ్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు..ఇలా చాలామంది వస్తారు….అలా అపరిచుతులు రాకపోకలు సాగించడం వల్ల ఎలహంక ప్యాలెస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లి ప్రచారంలోకి వస్తాయి..దాని వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఇక్కడ పెళ్లి వద్దు అని కఠిన నిర్ణయం తీసుకున్నాను.
చిన్నప్పటి నుంచి నా కళ్ల ముందు పెరిగిన జిలికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ, భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏ మాత్రం విస్మరించలేను.
నా కూతుళ్లు హర్ష లేదా వర్ష పెళ్లి అయినా సరే ఎలహంకలో వద్దు అనే నిర్ణయం తీసుకునేవాడిని’’ అంటూ షర్మిలకు జగన్ లేఖ రాశారు.
ఈ పెళ్లి ఎలహంకలో నిర్వహించడం విషయంలో తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తన అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని జగన్ ఆ లేఖలో కోరారు.
షర్మిల తన కొడుకు రాజా పెళ్లి వేరే కన్వెన్షన్ సెంటర్లో చేశారని, అలా అంజిలి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పెళ్లి వేడుక నిర్వహించుకోవాలని షర్మిలకు జగన్ సూచించారు.
అంజిలి పెళ్లి కోసం తాను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నానని, ఈ విషయంలో షర్మిల కూడా తన దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని జగన్ కోరారు.

Gulte Telugu Telugu Political and Movie News Updates