ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికలే కీలకం. తమ సత్తా నిరూపించేందుకు…. తమ బలం చాటుకునేందుకు ప్రజల్లో తమకు ఉన్న హవాను నిరూపించుకునేందుకు కూడా ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే ఎన్నికల వేళ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. నాయకులు కలవిడికి ప్రాధాన్యం ఇస్తారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, చిత్రంగా వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పార్టీని వీడిపోతున్నారు.
ఒక చోట, ఒక నియోజకవర్గం అయితే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకొంటున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం మంగళగిరిలో రాత్రికి రాత్రి 150 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు మంత్రి లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఈ పరిణామం మంగళగిరి స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఇది మరింత ఆటు పోటుగా మారింది.
సర్వేపల్లి నియోజకవర్గంలోనూ పార్టీ నుంచి నాయకులు బయటకు వచ్చేశారు. నిజానికి కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో సర్వేపల్లి వైసీపీ బలంగా ఉందని అనుకుంటున్న తరుణంలో తాజాగా 100 మంది నాయకులు, కార్యకర్తలు.. మాజీ మంత్రి సోమిరెడ్డి సారథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, గుంటూరు, కర్నూలులోనూ.. వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇలా.. నాయకులు కీలక సమయంలో పార్టీ కాడి పడేస్తున్న తీరు.. వైసీపీకి మైనస్ అయింది.
ఎందుకిలా.. ?
నాయకులు కీలక సమయంలో ఇలా కాడి పడేయడానికి ప్రధాన కారణం.. ఏంటనేది వైసీపీలో చర్చకు దారితీసింది. తమకు నచ్చని వారికి స్థానికంలో అవకాశం ఇవ్వడంతోపాటు.. కనీసం తమ ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న వాదన వైసీపీలో ఉంది. అలానే.. ఇప్పట్లో ఎలానూ అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడంతో స్థానికంగా అభివృద్ధి, పనులు చేయించుకునేందుకు అధికార పార్టీ అయితేనే బెటర్ అని భావించడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఈ కీలక సమయంలో తమకు మద్దతిచ్చేవారికి టీడీపీ కూటమి నాయకులు ప్రాధాన్యం ఇస్తుండడం కూడా ఈ చేరికలకు కారణంగా కనిపిస్తోందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates