స్థానిక నామినేషన్లలో డిష్యుం డిష్యుం

ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయాందోళన కనిపిస్తుంది. నామినేషన్ల సందర్బంలోనే ఇలా గొడవలు జరుగుతుంటే ఎన్నికల సమయంలో ఇంకెంతగా ఘర్షణలు జరుగుతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా ఘర్షణలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఘర్షణలు జరిగాయి. కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల వేళ పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థులు గుంపులుగా తోసుకొని కడప జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరి మీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు.

జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఘర్షణలు జరిగాయి. పులివెందులలోని రుషి స్కూల్ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని, లక్ష్మీ థియేటర్ సమీపంలో ఆయిల్ మిల్లును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి లారీకి నిప్పు పెట్టినట్లు ఫిర్యాదు వచ్చింది. ఇది మీ పనే అంటే కాదు మీ పని అని టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పుంగనూరులో నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.

శ్రీకాళహస్తి లో కొందరు వ్యక్తులు ఒక మోటారు బైకును తగల బెట్టడం కలకలం సృష్టించింది. రైల్వే కోడూరులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతపురం జిల్లాలో హౌస్ అరెస్టులతో అట్టుడికింది. ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లాలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకుల మధ్య గొడవ జరిగడం విచిత్రం.

పల్నాడు జిల్లాలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోలీసుల మీద, అభ్యర్థుల మీద దాడులు జరిగాయి. దీంతో పోలీసులు లాఠిలకు పని చెప్పారు. మార్కాపురం జిల్లాలోనూ గొడవలు జరిగాయి. మొత్తం రాష్ట్రంలో గొడవలు, ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.