సీట్లు దక్కని వాళ్లకు నామినేటెడ్ పదవులు

స్థానిక ఎన్నికల్లోకొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెల్లూరులో అయితే జనసేన పార్టీ తమకు 30 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ బీజేపీకి కేటాయించగా అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ మోహన రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. గోదావరి జిల్లాల్లో కూడా కూటమి పార్టీల మధ్య పొత్తు కుదరడం లేదు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపీటిసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పార్టీ గీటుదాటి రెబల్స్ గా పోటీ చేసే అభ్యర్థులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయని, కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. కూటమి పార్టీల నాయకులతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని చెప్పారు.

అంతేకాకుండా పొత్తులో భాగంగా మిత్రధర్మం పాటించాలని, సీట్లు దక్కని నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే అత్యధిక శాతం ఓటింగ్ పోల్ అయ్యేలా కృషి చేయాలని, ప్రజల ఆశీస్సులు పొందాలని సూచించారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, వారి కష్టం వృధా పోదని చెప్పారు. ఈక్రమంలో విభేదాలు వున్న జిల్లాలకు చెందిన ఇంచార్జి మంత్రులకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.