ఏపీలో సుమారు 12 కార్పొరేషన్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేషన్లకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. అవే.. విశాఖ, విజయవాడ. అందునా.. విజయవాడపైనే మెజారిటీ రాజకీయ నేతల దృష్టి ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే విజయవాడ గురించే ఇప్పుడు ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా.. ఫోన్లు చేసుకున్నా చర్చిస్తున్నారు. అంతగా హాట్ టాపిక్ కావడానికి కారణం.. కేవలం వంగవీటి రాధా పోటీలో ఉన్నాడనే కాదు.. మరోవైపు మాజీ ఐపీఎస్ ఉండడం!.
సాధారణంగా ఎన్నికలు అంటే. ప్రధాన పార్టీల మధ్యే జరుగుతుంది. కానీ.. విజయవాడలో ఇండిపెండెంటుగా బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. విషయంలో ప్రధాన పార్టీ వైసీపీ పరోక్షంగా మద్దతు ప్రకటిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు కాబట్టి.. టీడీపీని కూటమి ప్రభుత్వాన్ని ఇటీవల కాలంలో వ్యతిరేకిస్తూ వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ కూడా కొన్నాళ్లుగా హైలెట్ చేస్తోంది. తద్వారా టీడీపీ ఓటు బ్యాంకును తగ్గించాలన్నది వైసీపీ వ్యూహం.
అందుకే.. సోషల్ మీడియాలో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా పోస్టులు పెట్టిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు-కమ్మ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా సాగుతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నా.. ఇవేవీ ఆగడం లేదు. వాస్తవానికి వైసీపీకి విజయవాడలో అభ్యర్థులు దక్కలేదు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉన్నా.. ప్రస్తుతం ఆమె పోటీ చేసేందుకు విముఖత చూపించారు. తన దగ్గర అంత సొమ్ములేదని.. తాను పోటీచేయనని కూడా ఆమెతెగేసి చెప్పారు.
అయినప్పటికీ చివరి నిమిషంలో తప్పకపోవడంతోనే రాయన బరిలో దిగారని కూడా అంటున్నారు. ఇక, ఎలానూ ఆమెను నామమాత్రం చేసిన వైసీపీ.. పరోక్షంగా ఏబీవీకి మద్దతు ఇస్తోందన్నది కూటమి నాయకుల్లో జరుగుతున్న చర్చ. ప్రత్యక్షంగా కాకపోయినా..పరోక్షంగా అయినా.. మద్దతు ఇచ్చి.. ఏబీవీని గెలిపించుకోవడం ద్వారా.. రెండు రకాలుగా పంతం నెగ్గించుకోవాలని భావిస్తోందని చెబుతున్నారు.
1) తమ పార్టీని కాదని బయటకు వచ్చిన రాధాను ఓడించడం. 2) టీడీపీలోని కమ్మలను దూరం చేసి.. తద్వారా విజయవాడలో ఓటు బ్యాంకును చీల్చడం. ఈ రెండు వ్యూహాలే ప్రధాన లక్ష్యాలుగా వైసీపీ.. ఏబీవీకి ఇన్సైడర్గా సపోర్టు చేస్తున్నట్టు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates