అక్కడ జనసేన ఒంటరి పోరాటం

ఏపీలో లోకల్ వార్ కూటమి వర్సెస్ వైసీపీ అన్న రీతిలో ఉందనడంలో పెద్ద సందేహం లేదు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కూటమిలోని పార్టీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. సీట్ల పంపకంపై టీడీపీ, జనసేనల మధ్య కొన్ని చోట్ల సఖ్యత కుదరలేదు. అలాంటి ప్రాంతాల్లో నెల్లూరు కార్పొరేషన్ ఒకటి. ఈ క్రమంలోనే నెల్లూరు కార్పొరేషన్ లో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని జనసేన నేత టీ.శివ శంకర రావు సంచలన ప్రకటన చేశారు. కూటమి స్ఫూర్తికి విఘాతం కల్పించింది, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది టీడీపీ అని ఆయన ఆరోపించారు.

అందుకే, నెల్లూరు కార్పొరేషన్ లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని గర్వంగా చెబుతున్నానని అన్నారు. తమ అధినేత పవన్ ఒక ఆదేశం ఇచ్చారని, కూటమి స్ఫూర్తికి విఘాతం కలగకుండా 30 శాతం ఇచ్చిన కోటాలోనే పోటీ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ నేతలతో చర్చలు సఫలీకృతం కాలేదని, సమన్వయం కుదరలేదని అన్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ లతో దఫదఫాలుగా చర్చించామని, అయినా సరే తమకు చాలా తక్కువ సీట్లు కేటాయించాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారు చెప్పిన సీట్ల సంఖ్య పవన్ ఆలోచనకు చాలా దూరంగా ఉందని, రూరల్ లో మూడు..నాలుగు ఇస్తామంటున్నారని చెప్పారు. అది కుదరదని తాను చెప్పానని, ఇది కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించిందని అన్నారు. చర్చల తర్వాత నిర్ణయం కోసం చాలా సేపు వేచి చూశామని, కానీ, వారి నుంచి స్పందన రాలేదని అన్నారు. అందుకే, నెల్లూరు కార్పొరేషన్ లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. మరి, ఈ వ్యవహారంపై నెల్లూరు టీడీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది తేలాల్సి ఉంది.