ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు తమ పార్టీ గుర్తు ఇది అని మరీ మరీ చెబుతుంటారు నేతలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లకు పార్టీ గుర్తు మాత్రమే గుర్తుంటుంది కాబట్టి దానిని వారికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఒకే పార్టీ గుర్తును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కేటాయిస్తూ ఉంటుంది.
అటువంటి సందర్భంలో కొందరు ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే, గుర్తింపు పొందిన అనేక రాజకీయ పార్టీలు తమ పార్టీ సింబల్ ను పోలిన సింబల్ ను వేరే అభ్యర్థులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేస్తుంటాయి. ఆ విధంగానే జనసేన పార్టీ కూడా రెండు గుర్తులను ఏ అభ్యర్థికి కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గ్లాస్ గుర్తును పోలిన పెన్ స్టాండ్, బకెట్ గుర్తులను వేరెవరికీ కేటాయించకుండా ఫ్రీజ్ చేయాలని ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అవి రెండూ ఫ్రీ సింబల్స్ గా ఉన్నాయి.
కాగా, గతంలో జనసేనకు గాజు గ్లాసు(టంబ్లర్ గ్లాస్) గుర్తు విషయంలో కూడా జనసేన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించిందని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జనసేనకు గుర్తు కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో వాదనలు వినిపించింది. దీంతో, జనసేనకు గాజు గుర్తు ఫైనల్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates