జిల్లాల పోరు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చేనా?

మునిసిప‌ల్‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ వైసీపీ నేత‌ల హ‌డావుడి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. త‌న వారిని నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుంటున్నారంటూ.. ఒక‌వైపు న్యాయ పోరాటం చేస్తూనే మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్‌, ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. క‌ట్ చేస్తే.. ఈ ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక‌, చాలా వ‌ర‌కు ఏక‌గ్రీవాల‌కు అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు.. లెక్క‌కు మించి అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న నేప‌థ్యంలో ఈ ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది వైసీపీలో ఆస‌క్తిగా మారింది.

ఇక‌, ఈ వ్య‌వ‌హారం ఇలా కొన‌సాగుతున్న‌స‌మ‌యంలోనే మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. ఇవి కూడా స‌మాంతరంగా సాగ‌నున్నాయి. దీంతో జిల్లాల పోరు వైసీపీకి ఏమేర‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. అంతే కాదు.. జిల్లాలు, మండ‌ల‌స్థాయిలో వైసీపీ రాజ‌కీయాలు కూడా పెద్ద ఎత్తున ప్ర‌భావితం అవుతున్నాయి. దీంతో అభ్యర్థులు సైతం ల‌భిస్తారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. దీనికి ప్ర‌ధానంగా 2 కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. కూట‌మి స‌ర్కారు చేస్తున్న అభివృద్ధి ఒక‌టైతే.. జిల్లాల స్థాయిలో బ‌ల‌మైన నేత‌లు లేక‌పోవ‌డం రెండోది.

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత జిల్లాలు, మండ‌ల‌స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టింది. ర‌హ‌దారుల నిర్మాణం నుంచి రైతుల‌కు సంబంధించిన అన్ని ప‌నుల‌ను చేస్తున్నారు. దీనికితోడు మండ‌ల స్థాయిలో ఓటు బ్యాంకు ను ప్ర‌భావితం చేసే.. ప‌ట్టాలు, రైతుల భూముల‌కు సంబంధించిన అంశాలు, పెట్టుబడి సాయం(అన్న‌దాత సుఖీ భ‌వ‌) వంటివి క‌లిసి రానున్నాయి. ఇది వైసీపీకి భారీ మైన‌స్‌గా మార‌నుంది. పోటీ చేసేనాయ‌కులు.. దీనిని ఎదుర్కొనే వ్యూహాలు లేక ఇబ్బందులు త‌ప్ప‌వు.

ఇక‌, వైసీపీలో జిల్లా స్థాయి నాయ‌కుల‌కు కూడా ఎమ్మెల్యే సీట్ల‌పైనే ఆశ‌లు ఉండ‌డం మ‌రో విశేషం. దీంతోపాటు.. జిల్లా, మండ‌ల‌స్థాయి ఎన్నిక‌ల విష‌యంలో నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఖ‌ర్చుతో పాటు సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల విష‌యంలోనూ.. కూట‌మికి ఉన్న బ‌లం వైసీపీకి లేకుండా పోయింది. పైగా నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త కూడా ఫ్యాను పార్టీలో కొర‌వ‌డింది. ఈ నేప‌థ్యంలో జిల్లాల్లో ఎన్నిక‌లు వైసీపీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు ఏమేర‌కు క‌లిసి వ‌స్తాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ త‌ర్జ‌న భ‌ర్జ‌న స‌మ‌యంలోనే కూట‌మి త‌న స్ట్రాట‌జీని దూకుడుగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించడం గ‌మ‌నార్హం.