సుప్రీం ఆదేశాలు… నామినేషన్ల గడువు పెరుగుతుందా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి తదితర ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంతో అక్కడ నామినేషన్ల గడువు పొడిగించాలని వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా ప్రత్యర్థి పార్టీల వారు, పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే వైసీపీ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

19 చోట్ల హింస జరిగినట్లు ఫిర్యాదు అందిందని, ఆ స్తానాల్లో నామినేషన్ల తేదీలు పొడిగించడంపై ఎన్నికల కమిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్థానాల్లో ఈ నెల 25 వరకు అభ్యర్థులను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

ఓ పక్క ఈ తీర్పు వెలువడగా..మరోపక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా కూడా వైసీపీ అభ్యర్థులను కొన్ని చోట్ల నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి, తాజా తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.