నిన్న మొన్నటి వరకు తమకు కంచుకోటగా ఉందని భావించిన పుంగనూరు నియోజకవర్గం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. పుంగనూరులో పెద్దిరెడ్డి రాజకీయాలే కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఇక్కడ టీడీపీ పాగా వేసింది. నామినేషన్ల ఘట్టం నుంచే రగిలిపోయిన ఈ ప్రాంతం.. చివరకు వైసీపీ నామినేషన్లను వేసేది లేదని తేల్చేసింది. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.
అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. పుంగనూరులో వైసీపీకి హవా తగ్గిందనే చెప్పాలి. ఇక, పెద్దిరెడ్డి రాజకీయాల విషయానికి వచ్చినా.. పుంగనూరులో పెద్దగా ఆయన పట్టు కనిపించడం లేదు. నిజానికి చాలా ఏళ్లుగా ఇక్కడ చక్రం తిప్పుతున్న ఆయనకు ఇప్పుడు టీడీపీ సహా మరో రెండు పార్టీలకు చెందిన నాయకుల నుంచి ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలు పుంగనూరులో ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. ఈ కారణంగానే పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు పడుతున్నాయని చెబుతున్నారు.
- నియంతృత్వం: పుంగనూరు అంటే పెద్దిరెడ్డి అనే మాటే వినిపిస్తుంది. గత ఎన్నికల సమయంలోనూ ఇదే కనిపించింది. అయితే.. మారుతున్న ప్రజల దృష్టి.. వారి ఆకాంక్షలను పెద్దిరెడ్డి పట్టించుకోకపోగా.. తమ ధోరణినే ప్రజలపై రుద్దుతున్నారు. ఇది అంతిమంగా తిరుగుబాటుకు కారణంగా మారుతోంది. ప్రజల్లోనూ మార్పు దిశగా ఆలోచనలు వస్తున్నాయి. ఇదే.. తాజాగా స్థానిక ఎన్నికల్లో కనిపిస్తోంది. తొలిరోజే రణరంగంగా మారినా ప్రజలు పెద్గగా పట్టించుకోలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై సానుభూతి కూడా చూపించలేదు.
- బలమైన ప్రత్యామ్నాయం: ఆది నుంచి కూడా పెద్దిరెడ్డి వైఖరిపై అనేక విమర్శలు ఉన్నాయి. అంతా తమదే అన్న ధోరణి కూడా కనిపిస్తోంది. వైసీపీ అయినా.. గతంలో కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దిరెడ్డి తన వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఫలితంగా నిన్నటి వరకు బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో పెద్దిరెడ్డి హవాకు తిరుగు లేకుండా పోయినా.. ఇప్పుడు బలమైన నాయకులు.. పార్టీలు కూడా పుంగనూరులో పాగా వేశాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులపై పెద్దిరెడ్డి ఒత్తిడి ఇప్పుడు తిరుగుబాటుకు కారణంగా మారింది. మొత్తంగా ఇక్కడంగా పెద్దిరెడ్డి స్వయం కృతమేనని పెద్దగా చెప్పడానికి ఏమీలేదన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates