తెలంగాణలో పాలపిట్టలను విక్రయించే వారికి సీపీ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాలపిట్టలను పట్టుకున్నా.. వాటిని బంధించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలపిట్టలను విక్రయించడంపైనా నిషేధం ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో పాలపిట్టలను విక్రయిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయను న్నట్టు కూడా ప్రకటించారు. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి అని తెలిపారు.
మరి సీపీ సజ్జనార్ హెచ్చరికలకు.. పాలపిట్టలకు, దసరాకుఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికర విషయం.
తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి రోజున పాలపిట్టను చూడటం అత్యంత శుభసూచకంగా, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. దీంతో పాలపిట్టలను అమ్మేవారు..వాటిని పట్టుకుని పంజరాల్లో పెట్టి ఇంటింటికీ తిప్పుతూ.. డబ్బులు వసూలు చేసేవారు పెరుగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇదే జరుగుతోంది. దీంతోనే సజ్జనార్ హెచ్చరించారు.
దసరాకు పాలపిట్టకు ఉన్న ప్రాముఖ్యత ఇదీ..
దసరా రోజున ఉదయం పాలపిట్ట దర్శనం అయితే తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుందని, ఆ సంవత్సరం అంతా కలిసివస్తుందని ప్రజల నమ్మకం. శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని, ఆ తర్వాతే రావణ వధ జరిగి విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజు ఈ పక్షి దర్శనం విజయానికి ప్రతీకగా మారింది.
అంతేకాదు.. పాండవులు తమ అజ్ఞాతవాసం ముగిశాక, జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను తీసుకునే సమయంలో కూడా పాలపిట్టను చూశారని చెబుతారు. ఇది రాను రాను ప్రజల్లో ఒక విశ్వాసంగా మారిపోయింది. పాలపిట్టను చూడటం వల్ల మంచి జరుగుతుందని, ఆర్థికంగా లాభాలు కలుగుతాయని గ్రామీణ ప్రాంతాల్లో గాఢమైన నమ్మకం ఉంది. దీంతో ఇది నగరాలకు కూడా పాకింది. అందుకే.. పాలపిట్టల విక్రయాలు.. బంధించడాలు కూడా పెరిగాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates