అనంత‌పురం అంటే అంతే సార్‌!

అనంత‌పురం జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల స‌మ‌యంలోనూ ఈ జిల్లా అదే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తోంది. కొన్ని స్థానాల‌లో వైసీపీ అస‌లు పోటీ చేయ‌క‌పోయినా.. నామినేష‌న్‌లు వేయ‌క‌పోయినా.. కూట‌మి నాయ‌కులు ఏక‌గ్రీవంగా గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పోరాటం జ‌రుగుతుంద‌ని అనుకుంటే.. ఆయా పోరు కూడా సామాజిక వ‌ర్గాల మ‌ధ్యే ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.

బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ధ‌ర్మ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ధ‌ర్మ‌వ‌రం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కూడా.. చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే బ‌రిలో నిలిచారు. టీడీపీ నుంచి పరిశె సుధాకర్‌, వైసీపీ నుంచి కాచర్ల ఆంజనేయులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇద్ద‌రూ కూడా చేనేత వ‌ర్గానికి చెందిన వారే. దీంతో వీరి ఓట్లు ఎవ‌రికి అనుకూలంగా ఉంటాయ‌న్న‌ది చూడాలి.

బాల‌య్య ఫ్యామిలీతో ప్ర‌చారం!

హిందూపురం మునిసిపాలిటీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మంజునాథ్ ఫ్యామిలీ.. ఏకంగా ఎమ్మెల్యే బ‌ల‌య్య ఫ్యామిలీనే ప్ర‌చారానికి దింపాల‌ని భావిస్తోంద‌ట‌. ఇది సాధ్యం కాక‌పోయినా.. ప్ర‌చారం మాత్రం ఇలానే సాగుతోంది. త్వ‌ర‌లోనే మంజునాథ్ త‌ర‌ఫున బాల‌య్య కుటుంబ స‌భ్యులు ప్ర‌చారం చేస్తారు అని మంజునాథ్ కుటుంబం పేర్కొంటోంది. దీనికి కార‌ణం.. మంజునాథ్ తండ్రి, తాత‌ల‌కు ఎన్టీఆర్ హ‌యాం నుంచి నంద‌మూరి కుటుంబంతో స‌త్సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ ఇక్క‌డ నుంచి పోటీ చేసిన‌ప్పుడు.. వీరు స‌హ‌క‌రించార‌ని చెబుతున్నారు.

సేన‌కా.. సైకిల్‌కా?

మడకశిర మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానం వ్య‌వ‌హారం సందేహంలో ప‌డింది. కూట‌మి కేటాయింపులో భాగంగా ఈ సీటును జ‌న‌సేన‌కు ఇచ్చారు. శ్రీనివాసులు నామినేష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ, అనూహ్యంగా టీడీపీ త‌ర‌ఫున (ఎమ్మెల్యే మ‌ద్ద‌తు ఉంద‌ని అంటున్నారు) సీనియ‌ర్ నేత రాధాకృష్ణ స‌తీమ‌ణి శార‌ద‌తో నామినేష‌న్ వేయించారు. దీంతో సేన పోటీ చేస్తుందా? సైకిల్ పోటీ చేస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. చివ‌రి నిముషంలో మార్పులు ఉంటే త‌ప్ప‌.. దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

స్నేహితుల స‌మ‌రం!

పుట్ట‌ప‌ర్తి మునిసిప‌ల్ చైర్మ‌న్ పోస్టు కోసం.. స్నేహితులు పోటీ ప‌డుతున్నారు. జ‌న‌సేన త‌ర‌ఫున మేక‌ల ఈశ్వ‌ర్‌, వైసీపీ త‌ర‌ఫున అవినాశ్ నామినేష‌న్ వేశారు. చిత్రం ఏంటంటే.. వీరిద్ద‌రూ మంచి మిత్రులు. కానీ.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థులుగా మారిపోయారు. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే కూడా ఇద్ద‌రికీ కావాల్సిన వ్య‌క్తిగా ప్ర‌చారంలో ఉంది. దీంతో ఈ సీటులో గెలుపు ఎలా ఉంటుందో అన్న ఆస‌క్తి నెల‌కొంది.

మార్పు మంచిదేనా?

ముందుగా ఒక‌రిని అనుకుని.. త‌ర్వాత మ‌రొక‌రిని ఎంపిక చేసి.. చివ‌ర‌కు వేరేవారికి నామినేష‌న్ వేసే అవ‌కాశం ఇస్తే.. ఏ పార్టీలో అయినా ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అంటే.. సందేహం ఎందుకు? ఖ‌చ్చితంగా తేడా కొడుతుంది. తాజాగా క‌దిరిలో ఇదే జ‌రిగింది. బ‌ల‌మైన సెంటిమెంటు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కదిరి మున్సిపల్‌ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా తొలుత షేక్‌ సమీర పేరును ప్రకటించారు. దీంతో అన్నీ రెడీ చేసుకున్న ఆమెను చివ‌రి నిమిషంలో మార్చేశారు. ఫ‌లితంగా అర్షియా బాను నామినేష‌న్ వేశారు. ఇది మైనారిటీ వ‌ర్గాల్లో అసంతృప్తిని రేపుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.