అయ్య‌న్న ఇలాకాలో తోడికోడ‌ళ్ల ఫైటింగ్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుటుంబానికి మ‌రో కీల‌క ప‌ద‌వి చిక్కింది. ఇప్ప‌టికే చింత‌కాయ‌ల కుటుంబంలో అయ్య‌న్న న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యేగా, స్పీక‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఆయ‌న కుమారుడు విజ‌య్ పాత్రుడు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇటీవ‌లే ఎంపిక‌య్యారు. ఇక‌, తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో కీల‌క ప‌ద‌విని చింత‌కాయ‌ల అయ్య న్న‌పాత్రుడి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తికి చంద్ర‌బాబు క‌ట్టెబ‌ట్టారు. తాజాగా విడుద‌ల చేసిన రెండో జాబితాలో న‌ర్సీప‌ట్నం మునిసిప‌ల్ చైర్మ‌న్ పోస్టును ఆమెకు కేటాయించారు. దీంతో చింత‌కాయ‌ల ఫ్యామిలీకి మూడు ప‌ద‌వులు ద‌క్కిన‌ట్టు అయింది.

తోడికోడ‌ళ్ల మ‌ధ్య కుమ్ములాట‌!

తాజాగా ప్ర‌క‌టించిన న‌ర్సీప‌ట్నం టీడీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని చింత‌కాయ‌ల కుటుంబానికి చెందిన బీసీ మ‌హిళ‌కు ఇచ్చారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి ప‌ద్మావ‌తిని తాజాగా కూటమి తరపున ఎంపిక చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆమె శుక్ర‌వారం మంచిరోజ‌ని భావించి.. నామినేష‌న్ వేసేశారు. ఇక‌, శ‌నివారం ఆమెకు పార్టీ అధిష్టానం ఆశీస్సులు అందించింది. అధికారిక అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. దీంతో ఆమెకే కూట‌మి శ్రేణులు క‌లిసి రానున్నాయి.

అయితే.. ఇదేస్థానం నుంచి ప‌ద్మావ‌తికి వ‌రుస‌కు తోడికోడ‌లు అయ్యే చింతకాయల అనిత వైసీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేశారు. ఈమె అయ్యన్నపాత్రుడు తమ్ముడైన చింతకాయల సన్యాసిపాత్రుడు స‌తీమ‌ణి కావ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈమె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక‌, ఇక్క‌డే మ‌రో చిత్ర‌మైన ఘ‌ట‌న కూడా చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల్లో జ‌న‌సేన ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. టీడీపీకి కేటాయించ‌డంతో.. జ‌న‌సేన నిరాస ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, జనసేన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య కూడా చైర్మన్ పదవికి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

గెలుపు ఎవ‌రికి?

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. న‌ర్సీప‌ట్నంలో టీడీపీకి సానుకూల సంకేతాలు వున్నాయి. అయితే.. జ‌న‌సేన త‌ర‌ఫున రెబ‌ల్ అభ్య‌ర్థి బ‌రిలో నిల‌వ‌డం..సౌజ‌న్య‌కు మ‌హిళా ఓటు బ్యాంకు కూడా ఉన్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అయితే.. ఆదివారం వ‌ర‌కు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఆమెను బుజ్జ‌గించ‌నున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, వైసీపీకి కూడా న‌ర్సీప‌ట్నంలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఈ నేప‌థ్యంలో చింత‌కాయ‌ల ఫ్యామిలీకి చెందిన తోడికోడ‌ళ్ల మ‌ధ్యే ఫుల్ ఫైట్ జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.