స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు వేస్తున్నారు. ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కానీ అభ్యర్థులు సైతం ముందస్తుగానే నామినేషన్ వేసేస్తున్నారు. ఈ క్రమంలో అధికార టీడీపీ పోటీ చేస్తున్న 11 మేయర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించింది. మొత్తం 11 సామాజిక వర్గాల అభ్యర్థులు టీడీపీ తరపున పోటీకి దిగుతున్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా అన్నీ సామాజిక వర్గాలకు ప్రతినిద్యం లభించింది.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ప్రముఖులకు చెప్పారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ రీ ఇంజనీరింగ్ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. అన్నీ వర్గాలకు సమాన అవకాశం కల్పించినట్లు చెప్పారు. 2024 ఎన్నికలకు మించిన ఓట్లు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు.
కూటమి పొత్తులపై అక్కడక్కడ అసంతృప్తి, నిరసనలు కనిపిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మిత్ర ధర్మాన్ని పాటించాలని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సీట్లు కేటాయించామని, ఎక్కడైనా సమస్యలు వుంటే స్థానికంగా కూర్చొని చర్చించుకోవాలని సూచించారు. జనసేన, బీజేపీ నాయకులను కలుపుకొని పోవాలాన్నారు. అన్నీ పంచాయతీ, మండల పరిషత్, జెడ్పి చైర్మన్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates