కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు… ప్రస్తుత దేశవ్యాప్తంగా జరుగుతు న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను నిలుపుదల చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దేశవ్యాప్త ఉద్యమం.. బీజేపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాలు అత్యంత సున్నితమైనవి కావడం.. పైగా సాధారణ ప్రజల ఓటు బ్యాంకుతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేయడమే లక్ష్యంగా పక్కా వ్యూహాన్ని అనుసరించేందుకు కమల నాథులు రెడీ అయ్యారు. ఈ ఏడాది యూపీ సహా పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో నిర్లిప్తంగా వ్యవహరిస్తే మొత్తానికే నష్టమని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం తాజాగా.. దేశవ్యాప్తంగా ప్రచారానికి రెడీ అయింది. దీనిలో కేవలం కాంగ్రెస్ పార్టీచేస్తున్న విమర్శలు, డిమాండ్లను మాత్రమే బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకత, ఎన్నికల కమిషనర్ ఎంపిక సహా.. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, క్షేత్రస్థాయి నాయకులను కూడా చేర్చనున్నారు. ప్రజలతో బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు కుదిరితే.. ఇంటింటి ప్రచారం కూడా చేయాలని తాజాగా నిర్ణయించారు.
ఇక, వచ్చే వారం ప్రారంభం కానున్న దేశవ్యాప్త ప్రచారంలో ప్రధానంగా 7 అంశాలను ప్రస్తావించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు.. అదేవిధంగా ఆపార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎలా దుర్వినియోగం చేసింది. స్వతంత్ర సంస్థలైన.. ఈడీ, సీబీఐలను ఏవిధంగా వినియోగించుకుంది? అనే కీలక అంశాలను బీజేపీ నాయకులు ప్రజలకు వివరించనున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులే ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ నాయకులు తెలిపారు.
ఇవీ ఆ ఏడు అంశాలు..
- సర్ ప్రక్రియ పారదర్శకత, ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించడం. దీనిపై వస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టడం.
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎందుకు రాజీనామా చేయాలి.. ఆయన వృత్తి ధర్మం, నిజాయితీలను వివరిస్తారు.
- దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజలకు ఎందుకు దూరమైందో కూడా బీజేపీ నేతలు వివరించనున్నారు.
- గత 2014 నుంచి మోడీ పాలన ఎలా ఉందో.. ప్రజలు ఎందుకు మోడీనే మూడు సార్లు ఎన్నుకొన్నారో చెబుతారు.
- రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలుపుతున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెబుతారు.
- ఎన్నికలను పారదర్శకంగా ఎలా నిర్వహిస్తున్నదీ వివరిస్తారు.
- కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని.. ఆ పార్టీకి రాజ్యాంగ స్ఫూర్తి లేదని పేర్కొంటూ ప్రజలకు వివరించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates