విశాఖలో అదే స‌స్పెన్స్‌.. మేయ‌ర్ పోస్టు య‌మా హాట్‌… !

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, విశాఖ మేయర్ స్థానం మహిళా జనరల్ కేటగిరీకి దక్కింది. సుమారు 26 సంవత్సరాల తర్వాత ఈసారి మేయర్‌ను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా(ప్రజలే నేరుగా ఓటు వేసి) ఎన్నుకోనుండటంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. కూటమిలోని పార్టీల మధ్య సస్పెన్స్, అభ్యర్థుల రేసు వంటివి కూడా ఆస‌క్తిగా మారాయి.

వాస్త‌వానికి రిజర్వేషన్ ప్రకటనకు ముందు నుంచే ఈ సీటు కోసం కూటమిలో గట్టి పోటీ నడుస్తోంది. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. విశాఖలో తమకు బలమైన క్యాడర్ ఉందని, మేయర్ పీఠం తమకే దక్కాలని పట్టుబడుతోంది. అలాగే, జనసేన కూడా విశాఖ నగరంలో జనసేన ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని, అందువల్ల ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని ఆశిస్తోంది. బీజేపీ కూడా ఇదే జాబితాలో ఉంది. విశాఖ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను గుర్తుచేస్తూ.. ఈ సీటును తమకు ఇస్తే నగరాన్ని మరింత గ్లోబల్ సిటీగా మారుస్తామని కమలనాథులు ప్రతిపాదిస్తున్నారు.

రేసులో కీల‌క నేత‌లు..
మహిళా జనరల్ రిజర్వేషన్ రావడంతో, ఒక్కసారిగా ప్రధాన పార్టీల నుంచి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. టీడీపీ నుంచి.. నందమూరి తేజస్విని పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సీటును ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమెను బరిలోకి దించితే కూటమి విజయం సులువవుతుందని కొందరు భావిస్తున్నారు. ఇక‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. మంత్రి నారాయణ కుటుంబ సభ్యురాలైన శరణి పేరు కూడా రేసులో ఉంది.

మ‌రోవైపు.. వైసీపీ నుంచికూడా ప‌లువురు విశాఖ మేయ‌ర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఈ జాబితాలో ప్ర‌స్తుత ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరు బలంగా ప్రచారంలో ఉంది. ఇటీవ‌ల కాలంలో స‌ర్కారుపై విరుచుకుప‌డ‌డంలోనూ పార్టీ ప‌రంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డంలోనూ క‌ల్యాణి కీల‌కంగా ఉన్నారు. దీంతో ఆమె మేయ‌ర్ పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, ఇదే జాబితాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భార్య హిమగౌరి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా విశాఖ‌లో జోరు, హోరు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.