పులివెందులలో వైసీపీది సాహ‌స‌మా.. ధైర్య‌మా..?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పులివెందుల మునిసిపాలిటీలో ప్రస్తుతం వైసీపీ రాజకీయం తీవ్ర ఉత్కంఠభరితంగా ఉంది. టీడీపీ స‌హా బీజేపీ నేత‌ల నుంచి వ‌స్తున్న‌ సవాళ్ల‌తో మ‌రింత వేడెక్కింది. గతంలో ఈ మునిసిపాలిటీపై ఏకపక్ష ఆధిపత్యం చలాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందులలో పాగా వేయ‌డం ద్వారా వైసీపీకి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌మ ప‌ట్టునిలుపుకునేందుకు వైసీపీ ముమ్మ‌రంగా వ్యూహాలు ర‌చిస్తోంది.

ఈ నేప‌థ్యంలో పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వ్ కావడంతో, వైసీపీ అధినేత జగన్ తన బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి భార్య, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మను వైసీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. జగన్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కుటుంబ సభ్యురాలినే బరిలోకి దింప‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ప్ర‌చారంలో జ‌గ‌న్ కూడా పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క స్థానం కావ‌డం.. ప‌రిస్థితులు ఎదురుతిరుగుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఇది అత్యంత కీల‌కంగా మారింది.

గత ఓటమి ప్రభావంతోపాటు ఇప్పుడు.. టీడీపీ గట్టి పోటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. గత ఏడాది ఆగస్టులో జరిగిన పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీ ఓడిపోవడం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం కూడా సంచ‌ల‌నంగా మారింది. ఇది వైఎస్ కుటుంబ కంచుకోటకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని 40 వార్డులలో పట్టు కోల్పోకుండా ఉండటానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా జ‌గ‌న్ కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించారు.

ఇక‌, పులివెందుల మునిసిపాలిటీ వార్డుల పునర్విభజన కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి. గ‌త సెప్టెంబర్‌లో పులివెందులను 40 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దీనిపై అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ), వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది. పసుపు జెండా ఎగరేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు బీటెక్ రవి ఆధ్వర్యంలో గట్టి వ్యూహాలు రచిస్తుండటంతో మున్సిపాలిటీలో రాజకీయం హీటెక్కింది. దీనిని ఎదుర్కొనేందుకు వైసీపీ కూడా స‌ర్వం సిద్ధ‌మైంది. మొత్తంగా ఈ విష‌యంలో వైసీపీ ఎలాంటి వ్యూహాలు వేస్తుందో చూడాలి.