ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీనికి సుమారు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతోంది. అయితే.. ఆ స్థాయిలో ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతున్న సంస్థ లేదు. చాలా కంపెనీలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నా.. వేల కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. అయితే.. గూగుల్ తర్వాత.. ఇప్పుడు రిలయెన్స్ సంస్థ ఏకంగా లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పైగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని రిలయెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు.
ఇది మరింతగా యువతో ఆకాంక్షలను రేకెత్తిస్తోంది. లక్ష కోట్ల పెట్టుబడి, 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు.. వేలాది మందికి పరోక్ష లబ్దితోపాటు.. ప్రభుత్వానికి ఏటా 60 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం ఈ పెట్టుబడి ద్వారా రానున్నాయి. దీంతో అసలు ఈ పెట్టుబడి ఏంటి? ఎందుకు? అనే విషయాలు కీలకంగా మారాయి. భవిష్యత్తులో సంప్రదాయ ఇంధనం(పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి) స్థానంలో పర్యావరణ హిత హరిత ఇంధనానికి ప్రాధాన్యం పెరగనుంది. దీంతో ఈ రంగంలో భారీగా కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ మాస్టర్ ప్లాన్.
ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అనంత్ అంబానీ ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 3 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాబోయే కొన్ని దశాబ్దాలలో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 60,000 కోట్ల రెవెన్యూ సమకూరనుంది. ఇక, కీలకమైన పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, నేపియర్ గడ్డి వంటి సేంద్రీయ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఈ బయోగ్యాస్‌ను తయారు చేస్తారు. దీంతో సాగు వ్యర్థాలను అమ్ముకుని రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం లభించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సీజీబీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ రిలయెన్స్ పరిధిలోనే ఉంటాయి. తద్వారా.. ప్రతి జిల్లా, మండల పరిధిలో సీజీబీ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. అలానే.. రైతుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు, వాటిని నిల్వ చేసేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేయనున్నారు. దీనిలోనూ ఉపాధి,ఉద్యోగాలు ఉండనున్నాయి. ఇలా.. విశాఖ డేటా ఒకవైపు.. రిలయన్స్ మరోవైపు.. ఏపీకి భారీ పెట్టుబడులు ఇవ్వడంతోపాటు ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates