జ్ఞానేశ్ ను నార్త్ కొరియా కిమ్ దెగ్గరకు పంపాలి

ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, సర్ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 1928లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిందని, అదే మాదిరిగా 2028లో సర్ గో బ్యాక్ ఉద్యమం వస్తుందని రేవంత్ జోస్యం చెప్పారు.

గతంలో బూత్ లెవల్ లో ఓటర్ల జాబితా సవరణలు ఉండేవని, కానీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు మాత్రమే పూర్తి అధికారాలిచ్చారని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ అంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని, 20 కోట్ల ఓట్లు తొలలగించాలని మోదీ, జ్ఞానేశ్ ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందదో తెలియదని, ఆయనతోపాటు ఎలక్షన్ కమిషన్ లో మరో ఇద్దరున్నా వారికి కూడా ఆయన ఏం చేస్తున్నారో తెలియదని ఎద్దేవా చేశారు.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలన సాగిస్తున్నారని, అక్కడకు జ్ఞానేశ్ ను పంపించాలని చురకలంటించారు. నార్త్ కొరియాలో ఒకటే టీవీ ఛానెల్, ఒకటే రేడియో…ఒకటే ఎన్నికల గుర్తు ఉంటుందని, అక్కడ కిమ్ జాంగ్ మాత్రమే గెలుస్తారని అన్నారు.

అదే మాదిరిగా మోదీ గుర్తు, ఛానెల్ …అన్నీ ఇక్కడ జ్ఞానేశ్ ఏర్పాటు చేయాలని, అప్పుడు అందరూ మోదీకే ఓటిస్తారని సెటైర్లు వేశారు.1928లో సైమన్ గో బ్యాక్ నినాదంతో దేశమంతా ఏకమైందని, సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత ‘సర్’ గో బ్యాక్ నినాదంతో మరోసారి దేశమంతా ఏకం కావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ, .ఉద్ధవ్ థాకరే, స్టాలిన్…ఇలా సర్ ను వ్యతిరేకించే వారంతా ఒక్కతాటిపైకి రావాలని అన్నారు. ఓట్ల తొలగింపు, ఎస్ఐఆర్ సమస్య కాంగ్రెస్ ది మాత్రమే కాదని అన్నారు.