పెద్ద‌ల‌కు కూడా స‌ర్ చిక్కులు.. సామాన్యుల మాటేంటి?

కేంద్రంలో మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి, మాజీ ముఖ్య‌మంత్రుల‌కు కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్‌) ప్ర‌క్రియ తాలూకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అయితే..వారు త‌మ‌కు ఉన్న ప‌లుకుబ‌డితోనో.. అధికారంతోనో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి సామాన్యుల ప‌రిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు త‌లెత్తిన ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అయితే.. దీనికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ఎలాంటి స‌మాధానం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. స‌ర్‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని పేర్కొంది.

తాజాగా విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ ఎస్‌. జైశంక‌ర్, ఆయ‌న స‌తీమ‌ణి క్యోకోల ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని పేర్కొంటూ.. ఎన్నిక‌ల సంఘం నుంచి నోటీసులు అందాయి. 2002 నాటి ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాలో వీరి వివ‌రాలు మ్యాపింగ్‌ కావ‌డం లేద‌ని పేర్కొన్నారు. వీటిని స‌రిచేసుకునే బాధ్య‌త ఓట‌ర్లుగా మీదేన‌ని కూడా పేర్కొన్నారు. వాస్త‌వానికి జై శంక‌ర్‌కు ఢిల్లీలోని సుంద‌ర్‌బాగ్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఓటు హ‌క్కు ఉంది. అయితే.. తాజాగా స‌ర్ వివ‌రాలను ప‌రిశీలించిన‌ప్పుడు.. 2002 నాటి జాబితాతో వారి వివ‌రాలు స‌రిపోలేదు. ఈ విష‌యాన్నే పేర్కొంటూ ఎన్నిక‌ల సంఘం నోటీసులు ఇచ్చింది.

మ‌రోవైపు ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్‌, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటు హ‌క్కు కూడా స‌రిపోలలేద‌ని పేర్కొంటూ ఎన్నిక‌ల సంఘం నోటీసులు ఇచ్చింది. అయితే.. దీనిపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాను ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశాన‌ని..త‌న ఓటే లేన‌ప్పుడు.. త‌న‌ను ఎలా అనుమ‌తిచ్చార‌ని ఆయ‌న నిల‌దీశారు. దీంతో త‌ప్పు స‌రిచేసుకుంటున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఆవెంట‌నే ఆయ‌న ఓటును స‌రిదిద్దింది. మ‌రి.. ఇలా.. ఉన్న‌త స్థాయి వ‌ర్గాల‌కే.. ఓటు హ‌క్కు విష‌యంలో త‌డ‌బాట్లు క‌నిపిస్తే.. సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌న్నది ప్ర‌శ్న‌. ఇక‌, దేశ‌వ్యాప్తంగా 2 కోట్ల‌ మందికిపైగానే ఓటు గ‌ల్లంత‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ‌లో..

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో స‌ర్ ప్రక్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే నెల రెండో వారంలో ఏపీలోనూ.. మూడో వారంలో తెలంగాణ‌లో స‌ర్ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది. అనంత‌రం.. పూర్తిస్థాయిలో ఓట‌ర్ల జాబితాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ‌కు సంబంధించిన తుది స‌ర్వే కొన‌సాగుతోంది. 2002లో మ్యాపింగ్ కాని వారు వెంట‌నే మ్యాపింగ్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ గ‌డువును మ‌రింత పెంచాల‌ని.. స‌మీపంలో ఎన్నిక‌లు లేనందున‌.. ఓట‌ర్ల‌కు స్వేచ్ఛ ఇవ్వాల‌ని కోరింది. కానీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఏపీలో అయితే.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ప్ర‌ధాన పార్టీల నుంచి ఇలాంటి స‌మ‌యం కొన‌సాగింపున‌కు ఎలాంటి అభ్యర్థ‌న‌లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.