తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో సీఎం రేవంత్.. ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రధాని మోడీ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. కాగా.. రేవంత్‌కు సమాధానంగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి స్పందించారు. అమెరికా పర్యటన వెనుక అసలు విషయాన్ని దాచి కేంద్రాన్ని ఆయన అనుమతి కోరారని ఆరోపించారు. భారతదేశాన్ని, ప్రధాని మోడీని నిరంతరం తిట్టిపోయే న్యూయార్క్ మేయర్ మమ్దానీతో రేవంత్ భేటీ కావాలని అనుకున్నారని.. అందుకే ఆయనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అంతేకాదు.. అమెరికాకు ఎందుకు వెళ్తున్నారంటే పెట్టుబడుల కోసమని సీఎం రేవంత్ చెబుతున్నారని, కానీ, పెట్టుబడుల కోసం ఆయనే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు, ఇతర మంత్రులను కూడా పంపించి పెట్టుబడులు సాధించు కోవచ్చని తెలిపారు. పెట్టుబడులు తీసుకురావాలన్న సంకల్పం ఉంటే.. ఎలాగైనా సాధించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, పెట్టుబడుల పేరుతో భారత్‌ను గుడ్డిగా వ్యతిరేకించే వ్యక్తులను రేవంత్ కలుసుకోవాలని అనుకోవడం దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా విదేశాంగ శాఖ ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలపై సమాచారం సేకరిస్తుందని తెలిపారు.
గతంలో ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అమెరికాకు వెళ్లాలని అనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.(కానీ. వాస్తవం.. ఏంటంటే.. అప్పట్లో అమెరికానే మోడీని రానివ్వబోమని పేర్కొంది). అదేవిధంగా నాటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అమెరికా వెళ్లకుండాఅడ్డుకున్నారని గుర్తు చేశారు. ఒక్క బీజేపీనే కాదు.. నాటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలానే వ్యవహరించిందన్నారు. దీనికి కారణం.. భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానమేనని కిషన్ రెడ్డి చెప్పారు.
హోదా మరిచిపోతున్నారా?
రేవంత్ రెడ్డి తన హోదాను మరిచిపోతున్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని.. ఆ హోదాలో విదేశాలకు వెళ్లేప్పుడు.. అంతే హుందాగా వ్యవహరించాలని సూచించారు. కానీ, పాకిస్థాన్‌తో స్నేహం చేస్తూ.. భారత్‌పై విషం కక్కుతున్న మమ్దానీ వంటి వ్యక్తులను కలుసుకునేందుకు కుదరదన్నారు. న్యూయార్క్‌లో మన హిందువులను కూడాఆయన అవహేళన చేశారని గుర్తు చేశారు. దీనిపై రాజకీయం చేయడం రేవంత్ కు తగదని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates