ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని ముక్కలు చేశారు. కొన్ని ముక్కలతో బిర్యానీ వండారు. మిగిలిన ముక్కల్ని ఒక సూట్ కేసులో పెట్టి రైల్లో వదిలేశారు. అత్యంత క్రూరమైన ఈ ఘటన చెన్నైలో జరిగింది.
ఈ నెల 5 వ తేదీన చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. కిక్కిరిసిన జనరల్ బోగిలో ఎక్కడి నుంచో దుర్వాసన రావడం కొంతమంది ప్రయాణికులు గుర్తించారు. అనుమానం వచ్చి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వారికి ఒక ఎర్ర రంగు సూట్ కేసు కనిపించింది. అందులోంచి వాసన వస్తుందని నిర్దారించిన పోలీసులు సూట్ కేసు తెరిచి చూశారు. మానవ శరీర భాగాలు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ సూట్ కేసు చెన్నై నుంచి వచ్చినట్లు నిర్ధారించారు.
కేసు తమిళనాడుకు చేరుకుంది. చెన్నై సెంట్రల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్, దాని పరిసరాలలో వున్న సీసీ ఫుటేజిలను పరిశీలించారు. 350 ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను ఆణువణువూ పరీశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఒక పురుషుడు, ఒక మహిళ ప్రయాణికుల్లా నటిస్తూ తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఎక్కారు.
తమ వెంట తీసుకొని వచ్చిన ఎరుపు రంగు సూట్ కేసును రైల్లో పెట్టేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి పక్కనే వున్న సబర్బన్ రైలు ఎక్కి గుడువాంజేరి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు సులువుగా వారింటికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేరు కానీ ఆ ఇంట్లో ఒడిశా కు చెందిన మాణిక్ ఉత్తిన్, భాగమతి దంపతులతో పాటుగా హయత్ నిషా అనే మహిళ కూడా నివసిస్తున్నట్లు తెలిసింది. భర్త చనిపోవడంతో తన తమ్ముడు, మరదలి వద్ద ఉంటున్నట్లు నిషా ఇరుగు పొరుగు వారికి చెప్పేదని స్థానికులు చెప్పారు.
ఇక్కడే కథ మలుపు తిరిగింది. మాణిక్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లిన పోలీసులకు కళ్ళు తిరిగినంత పనైంది. ఇల్లంతా రక్తపు మరకలతో నిండి వుంది. మానవ శరీరంతో బిర్యానీ వండిన పాత్ర కనిపించింది. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని చంగాల్పట్టు పోలీసు స్టేషన్లో అప్పగించారు.
ప్రస్తుతం నిందితులు పరారీలో వున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గుడువాంజేరి గ్రామస్తులను కలవరానికి గురి చేసింది. మనుషుల్లో మానవత్వం కనుమరుగై పోతుందని, హింసా ప్రవృత్తి పెరిగిపోతుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates