చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌ల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల మీదా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతుంటాడు నాని. అలాంటి వ్య‌క్తి శ‌నివారం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌ని చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నాడు. గుడివాడ‌లో చిరు అభిమానుల స‌మ‌క్షంలో నాని కేక్ క‌ట్ చేసి చిరు బ‌ర్త్ డేను జ‌ర‌ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ త‌న‌కు సీనియ‌ర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమాన‌మ‌ని చెబుతుంటాడు నాని. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటూ చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటాడు. బాబుకు వెన్నుద‌న్నుగా ఉన్నందుకు ప‌వ‌న్ మీద విరుచుకుప‌డుతుంటాడు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ప‌వ‌న్ మీద దూష‌ణ‌ల‌కు దిగిన నాయ‌కుల్లో నాని ఒక‌డు.

అలాంటి వ్య‌క్తి ప‌వ‌న్ అన్న‌య్య పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రిపించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. అస‌లు ప‌వ‌న్ అంటే గిట్ట‌ని నానిని చిరు పుట్టిన రోజు వేడుక‌ల‌కు మెగా అభిమానులు ఎలా ఆహ్వానించార‌న్న‌ది ప్ర‌శ్న‌. వైసీపీ వాళ్లే చిరు అభిమానుల దృష్టిని ఆక‌ర్షించేందుకు, రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం ఇలా మెగాస్టార్ బ‌ర్త్ డేను జ‌రిపి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. 

వైఎస్ జ‌గ‌న్ సీఎం అయిన మొద‌ట్లో చిరు ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన నేప‌థ్యంలో మెగా అభిమానుల్లో చీలిక తెచ్చి ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉసిగొల్పే ప్ర‌య‌త్నం అప్ప‌ట్లో గ‌ట్టిగా జ‌రిగింది. కానీ త‌ర్వాత ఆ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. మెగా అభిమానులు ఒక్క‌టై ప‌వ‌న్ వెంట న‌డిచారు. జ‌గ‌న్‌ను, వైసీపీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశారు. ఐతే 2029 ఎన్నిక‌ల కోసం ర‌క‌ర‌కాల వ్యూహాలు ప‌న్నుతున్న వైసీపీ మ‌ళ్లీ మెగా అభిమానుల్లో చీలిక తెచ్చే ప్ర‌య‌త్నంలో ఇలాంటి వేడుక‌లు భాగ‌మా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.