ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తుండటం అందరికి తెలిసిందే. అధికార పక్షంలో ఆయనే కీలకమయ్యారు. ప్రతిపక్షం కూడా ఆయన పైనే గురి పెట్టింది. దాంతో లోకేష్ గ్రాఫ్ పెరిగింది.
తనయుడిని తీర్చిదిద్దుతున్న చంద్రబాబు….
ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు దాటాయి. ఇప్పటికే అయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అయితే రాబోయే కాలంలో తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇప్పటికే టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవి అప్పజెప్పారు. పార్టీ కీలక అంశాలని కుమారుడికి అప్పగించేశారు. ఇక మిగిలింది పట్టాభిషేకం. పరిపాలనా అనుభవం కోసం విదేశాలు తిప్పుతున్నారు. తరచుగా ఢిల్లీకి పంపిస్తున్నారు. కేంద్రంలోని మంత్రులతో మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వంలో తీసుకునే కీలక నిర్ణయాలలో లోకేష్ ను ఇన్వాల్వ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాబోయే కాలంలో లోకేష్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తుంది.
లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ…
ప్రతిపక్ష వైసీపీ లోకేష్ ను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తుండడం గమనించవచ్చు. నిన్నా మొన్నటి వరకు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు డీఎస్సి అక్రమాల గురించి పోరాటం స్టార్ట్ చేసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేసింది.
అంటే భవిష్యత్తులో తాము లోకేష్ తోనే పోరాడాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థిర నిర్ణయానికి వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను సైతం పక్కన పెట్టి లోకేష్ పై బాణం ఎక్కు పెట్టడం దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు . మొత్తం మీద అటు అధికార పార్టీ లోకేష్ చుట్టూ తిరుగుతుంటే ఇటు ప్రతిపక్షం కూడా లోకేష్ కేంద్రంగానే విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
