భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసిన నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేబినెట్ నుంచి తొలగించాలన్న డిమాండ్ తో వాంగ్ చుక్ దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 28న మొదలైన ఈ దీక్ష శుక్రవారం నాటికి 20వ రోజుకు చేరింది. ఈ క్రమంలో వాంగ్ చుక్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ దీక్షకు నానాటికీ మద్దతు పెరుగుతోంది.
ఓ వైపు దీక్షకు మద్దతు పెరుగుతున్నా… మరోవైపు నిరాహార దీక్ష కారణంగా 20 రోజులుగా ఆహారం లేని కారణంగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. 20 రోజుల దీక్ష కారణంగా వాంగ్ చుక్ ఏకంగా 9.5 కిలోల బరువు తగ్గిపోయారు. ఈ క్రమంలో దీక్ష విరమించాలంటూ పలు వర్గాల నుంచి వస్తున్న వినతులను వాంగ్ చుక్ తిరస్కరిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ తో దీక్షకు దిగిన తాను కేంద్రం దిగిరాకపోతే… ఈ నెల 20న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తానని వాంగ్ చుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే మాటను శుక్రవారం కూడా వినిపించిన సోనమ్… ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
వాంగ్ చుక్ పిలుపునిచ్చిన ఛలో పార్లమెంటుకు ఇంకో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై శుక్రవారం సోనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీక్ష కారణంగా తన ఆరోగ్యం క్షీణించిందన్న విషయం తనకు తెలుసునని చెప్పిన వాంగ్ చుక్… ఏదేమైనా దీక్ష విరమించేది లేదని తేల్చేశారు. అంతేకాకుండా చలో పార్లమెంటు కార్యక్రమాన్ని చేపట్టి తీరతానని కూడా ఆయన ప్రకటించారు. అప్పటిదాకా తాను బతికే ఉంటానని చెప్పిన సోనమ్… ఒకవేళ తాను చనిపోయినా… ప్రేతాత్మ రూపంలో అయినా వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. సోనమ్ దీక్ష విరమించేలా చర్యలు చేపట్టాలని గురువారమే ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోనమ్ దీక్ష విరమించకపోతే… ఆయన లెవనెత్తిన సమస్య పరిష్కారం దిశగా అయినా దృష్టి సారించాలని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు సోనమ్ దీక్షకు కక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. సోనమ్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం దిగిరాక తప్పదని కూడా దీప్కే అన్నారు. మొత్తంగా సోనమ్ తన దీక్షతో యావత్తు దేశాన్ని తన వైపునకు తిప్పుకోగలిగారు. మరి తన డిమాండ్లను ఆయన ఏ రీతిన సాధిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates