పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్… ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో, లేదంటే లోకేశ్ అంటే ఇష్టం లేని వారో పెట్టిన పేరు కాదు. లోకేశ్ స్పీడును చూసి మంత్రముగ్ధులైన విదేశీ పారిశ్రామికవేత్తలు ఆయనకు పెట్టిన పేరు ఇది. పల్లి పల్లి లోకేశ్ అంటే… త్వరగా త్వరగా లోకేశ్ అని అర్థం. ఏ విషయంలో అయినా ఇలా చెబుతుంటే అలా నిర్ణయాలు తీసుకుంటున్న లోకేశ్ తీరు చూసిన దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలు ఆయనకు పెట్టిన పేరు ఇది. 

ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపే దిశగా యమా స్పీడుతో సాగుతున్న లోకేశ్.. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబడుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ అండ్ కో కారణంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులు సాదిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కడ పార్టనర్ షిప్ సమ్మిట్ లు జరిగినా లోకేశ్ ఆయా సమావేశాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయా సమావేశాలకు వచ్చిన పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. తనదైన శైలి ప్రజెంటేషన్ తో రాష్ట్రానికి వచ్చేలా ఆయా పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో జరుగుతున్న సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో పాలుపంచుకునే నిమిత్తం లోకేశ్ అక్కడికి వెళ్లారు. శుక్రవారం కొరియా దేశానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై లోకేశ్ నిజంగానే తనదైన శైలి ప్రజెంటేషన్ ను ఇచ్చారు. అలా లోకేశ్ ఇస్తున్న ప్రజెంటేషన్ ను కొరియా పారిశ్రామికవేత్తలు శ్రద్ధగా ఆలకిస్తూ సాగారు. ప్రజెంటేషన్ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్ అక్కడికక్కడే నివృత్తి చేశారు. 

ఇలా లోకేశ్ తన ప్రజెంటేషన్ తో పాటుగా తమ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న తీరును ఆసక్తిగా గమనించిన కొరియా పారిశ్రామికవేత్తలు లోకేశ్ ను పల్లి పల్లి లోకేశ్ అంటూ సంబోధించారు. అంటే… ఏ విషయంపై అయినా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని… వారంతా లోకేశ్ ను అలా పల్లి పల్లి లోకేశ్ అని సంబోధించినట్లుగా ఆ తర్వాత వారు తెలిపారు. మొత్తంగా కొరియా వెళ్లిన లోకేశ్…తనదైన శైలి పనితీరుతో కొత్త పేరును తెచ్చుకున్నారు. మరి ఈ టూర్ లో లోకేశ్ తన రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తీసుకురానున్నారో చూడాలి.