మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వచ్చిన ఈ పదం 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సంబంధించి కీలక భూమిక పోషించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2029 ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్ అని జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ఈ ప్రకటనపై ఇప్పటిదాకా ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తూ ఉంటే… టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలి రేంజిలో దీనిపై స్పందించారు. మావిగనా?.. లేదంటే మాయా జగనా? అని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది.

Gulte.com కు చింతమనేని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మా ప్రతినిధి మావిగన్ పై సంధించిన ప్రశ్నకు చింతమనేని తనదైన రేంజిలో స్పందించారు. మావిగనా?.. మాయా జగనా? అంటూ చింతమనేని స్పందించిన తీరు అందరినీ ఆలోచనలో పడేసింది. వాస్తవానికి చింతమనేని సొంత నియోజకవర్గం దెందులూరుకు టీడీపీ ఎంపిక చేసిన రాజదాని అమరావతి కంటే జగన్ ప్రతిపాదించిన మావిగనే దగ్గర. అయినా కూడా మావిగన్ పై చింతమనేని ఓ రేంజిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మతితప్పిందని, ఈ క్రమంలోనే ఆచరణ సాధ్యం కాని రీతిలో ఆయన మావిగన్ అంటూ ప్రతిపాదించారని చింతమనేని సెటైర్లు సంధించారు.

జగన్ నోట నుంచి వచ్చిన మావిగన్ పై తనతో పాటుగా ప్రజలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారని చింతమనేని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేస్తే… దానిని జగన్ కూడా అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమరావతికి సంపూర్ణ మద్దతు పలికిన జగన్… ఐదేళ్లకే తన మాట మార్చి మూడు రాజధానుల బాట పట్టారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల మాటను ఐదేళ్ల పాటు వల్లె వేసిన జగన్… అధికారం దూరం కాగానే…మతి భ్రమించి ఏం చెప్పాలో తెలియక మావిగన్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మావిగన్ రాజధానిగా ఎదిగే అవకాశమే లేదని చింతమనేని తేల్చి పారేశారు.