ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని తేల్చేసిన ఓ కీలక విషయంపై సంచలన నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పండగ వాతావరణం తీసుకువచ్చారు. తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న సుమారు 8 లక్షల మందికిపైగా ఉద్యోగులకు పదవీ విరమణ వయసును ఒకేసారి 2 ఏళ్లపాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఫలితంగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్నవారు.. 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉద్యోగాల్లో కొనసాగవచ్చు. వారికి పూర్తిస్థాయి వేతనంతోపాటు ప్రస్తుతం అందుతున్న అన్ని అలవెన్సులు, ఇతర భత్యాలు కూడా యథాతథంగా అందుతాయి. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై హామీ ఇచ్చినా..గతంలో జగన్ దీనిని అమలు చేయలేక పోయారు. దీంతో ఆయా విభాగాల ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తమకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కానీ, అప్పట్లో ప్రభుత్వానికి భారం అవతుందని భావించిన జగన్ ఈ విషయాన్ని ఐదేళ్లు నాన్చారు.
ఇక, ఇతర విషయాలకు వస్తే.. పెట్టుబడుల కల్పనకు మరోసారి కేబినెట్ పెద్దపీట వేసింది. 34 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 35 వేల మంది పైచిలుకు యువ తకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అలాగే రాజధాని పరిదిలోని ఉండవల్లిలో యోగా కేంద్రంతోపాటు.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికిగాను 429 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. తద్వారా.. ఉండవల్లిలోని అంతర్గత రహదారులు, ప్రాజెక్టులు సాకారం కానున్నాయి.
రాజధాని అమరావతిలో జరుగుతున్న రెండు దశల భూసమీకరణకు సంబంధించిన పనులకు కూడా మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. అలాగే.. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు మరో 95 మంది తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను నియమించనున్నారు. తద్వారా రైతుల ఇబ్బందులను పరిష్కరించనున్నారు. ఇక, రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే భూమి, విద్యుత్, పన్నులు, నీరు.. వంటివాటి రాయితీలను నిర్ధారించారు. ఆయా కంపెనీలు.. పనులు చేపట్టిన తర్వాత.. వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. కడప, అనంతపురంలో సౌర, పవన విద్యుత్ సంస్థలకు కూడా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates