విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే… ఈ వ్యవహారంలో వైసీపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అధికార కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి తల్లి విజయలక్ష్మిని ఆయన ఓదార్చారు. సాయి వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేసిన జగన్… ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం అంతకంతకూ జఠిలం అవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం జగన్ నేరుగా సాయి ఇంటికి వెళ్లారు. సాయి తల్లిని ఓదార్చిన జగన్…ఈ విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కష్టకాలంలో మీకు అండగా ఉంటామని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు. ఈ ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సాయి ఇంటి ముందే మీడియాతో మాట్లాడారు. సాయి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. సాయికృష్ణ వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజును సస్సెండ్ చేశారంటేనే… తప్పు జరిగిపోయిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా అని ఆయన అన్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మికి కనీస స్పందన కూడా లభించకపోవడం దారుణమన్నారు. సాయి తల్లి ఫిర్యాదును డీజీపీ కార్యాలయం చెత్తబుట్టలో దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. కోర్టుకు వెళితే గానీ సాయి తల్లి ఆవేదనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని ఆయన అన్నారు.
ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దానికి కాకినాడ జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించిన తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి వ్యవహారంలో సీఐ స్థాయి నుంచి ఏసీపీ, సీపీ..చివరకు డీజీపీకి కూడా పాత్ర ఉందన్న జగన్.. ఇంత పెద్ద స్థాయి పోలీసు అధికారులకు పాత్ర ఉన్న ఈ కేసు దర్యాప్తును ఓ ఎస్పీ స్థాయి అధికారికి కట్టబెట్టడంతోనే ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఇట్టే అర్ధం అయిపోతోందన్నారు. ఈ వ్యవహారంలో హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకూ పాత్ర ఉందని కూడా జగన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా సాయి ఇంటికి జగన్ వెళ్లడం, ఈ వ్యవహారంపై ఆయన సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates