నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇద్దరిదీ ఒకే బాట. బాండింగ్ లో అయినా.. బ్రాండింగ్ లో అయినా కూడా వీరిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు తాము ఎంచుకున్న అంశానికి ఏ మేర ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు. అంతేకాదండోయ్… ఆ అంశానికి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చేందుకు వారు నిస్వార్థంగా శ్రమిస్తారు. వెరసి తాము మేటిగా ఎంచిన వస్తువుకు ఇతోదిక లాభాన్ని చేకూరుస్తారు.
సరే… అసలు విషయం ఏమిటంటారా? అక్కడికే వెళ్లిపోదాం పదండి. ఏలోని ఉత్తరాంధ్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్న అరకులో పండే కాఫీకి ఓ రేంజి ప్రత్యేకత ఉందన్న విషయం తెలిసిందే కదా. మన్యం ప్రాంతంలోని గిరిజన రైతులు పండించే ఈ అరకు కాఫీకి ఓ పదేళ్ల వరకు ఎలాంటి గుర్తింపు లేదనే చెప్పాలి. అయితే విభజిత ఏపీకి తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. దీని ప్రత్యేకతను గుర్తించి… దానికి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం లబించే దిశగా పలు కీలక చర్యలు చేపట్టారు. వ్యాపారంలో మేటిగా పేరు తెచ్చుకున్న ఓ బిజినెస్ మ్యాన్ ను తీసుకువచ్చి అరకు కాఫీని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈ అరుదైన కాఫీకి చంద్రబాబే ఓ బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా మారిపోయిన వైనం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు బాబు బాటలోనే పవన్ కూడా నడుస్తున్నారు. గతంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏపీకి వచ్చే విశిష్ట అతిథులకు అరకు కాఫీ పొడిని గిప్ట్ గా ఇచ్చిన బాబు… ఇతర ప్రాంతాలకు తాను వెళ్లిన సందర్భంగానూ అరకు కాఫీని అందించడంతో పాటు దాని విశిష్టతను చెప్పేవారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. దేశ రాజధానిలో పార్టీ కీలక భేటీ కోసం రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పవన్… తన వెంట అరకు కాఫీ పొడి ప్యాకెట్లను తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం పవన్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబందించి ఏపీకి రావాల్సిన అంశాల గురించి ఆయన కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు.
ఇలా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లిన సమయంలో పవన్ తన వెంట అరకు కాఫీ ప్యాకెట్లను తీసుకెళ్లారు. కేంద్ర మంత్రులతో కలిసిన సందర్భంగా వారిని సన్మానించిన పవన్.. వారికి అరకు కాఫీ ప్యాకెట్లను గిఫ్ట్ లుగా అందజేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికి ఇలాగే అరకు కాఫీ ప్యాకెట్లతో వెళ్లిన పవన్… ఆ ప్యాకెట్ ను కేంద్ర మంత్రికి అందించారు. ఈ సందర్బంగా పవన్ తనకు ఇస్తున్న గిఫ్ట్ ను గమనించిన చౌహాన్.. అరకు కాఫీ అంటూ సంభ్రమాశ్యర్యాలకు గురి అయ్యారు. మొన్నటిదాకా చంద్రబాబు ఈ తరహాలో అరకు కాఫీకి బ్రాండింగ్ చేస్తుండగా…ఇప్పుడు బాబుకు తోడుగా పవన్ కూడా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తూ అందరినీ విస్మయానికి గురి చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates