ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ.. రూపొందించిన సీబీఎన్ @ 361 డిగ్రీస్ పుస్తకాన్ని స్వయంగా చంద్రబాబే ఆవిష్కరించారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన.. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీబీఎన్ @ 361 డిగ్రీస్.. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటికోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. దీనిని ఇంగ్లీషలోకి అనువదించి.. తాజాగా సింగపూర్‌లో ఆవిష్కరించారు.
పుస్తకంలో ఏముంది?
- సీబీఎన్ @ 361 డిగ్రీస్.. పుస్తకంలో.. దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించారు.
- ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిల్యాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాడ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఏపీ అభివృద్ధికి విజన్‌ల రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు.
- బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను సీబీఎన్ @ 361 డిగ్రీస్ పుస్తకంలో పేర్కొన్నారు. తద్వారా చంద్రబాబు కీర్తి.. ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించనుంది. అంతేకాదు.. ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలా జాతీయం నుంచి అంతర్జాతీయ స్థాయికి పుస్తకం ముద్రించడం కూడా ఇదే తొలిసారి కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates