ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారు. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. ఆయన పరపతి దారుణంగా పడిపోయింది మాత్రం ఇరాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడే అని చెప్పాలి.
ఎందుకంటే.. ఇరాన్ తో అమెరికా జరిపిన యుద్ధం సందర్భంగా ఆయన నోటి నుంచి చెప్పే మాటకు భిన్నమైన మాటను పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో.. ట్రంప్ నోటి నుంచి వచ్చే మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా పరిస్థితి మారింది.
అయితే.. తాజాగా ప్రపంచమా ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే.. గడిచిన కొద్ది నెలలుగా సాగుతున్న అమెరికా -ఇరాన్ మధ్య యుద్ధం ముగిసినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే చెబితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఈసారి ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించటంతో యుద్ధం ముగిసిందన్న విషయం స్పష్టమైన పరిస్థితి. దీంతో.. పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడినట్లుగా చెప్పాలి.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున (సోమవారం) 3 గంటల ప్రాంతంలో (వాషింగ్టన్ సమయం ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో) ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేశారు. అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించిన పాక్ ప్రదాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇదే అంశంపై ప్రకటన చేశారు.
అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం ముగిసేలా చేయటంలో ఖతార్ మధ్యవర్తి పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. లెబనాన్ తో సహా అన్ని సరిహద్దు ఫ్రంట్ లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ సమయంలోనే మరిన్ని చర్చలు జరపటం ద్వారా శాంతిని మరింత ముందుకు తీసుకెళ్లే వీలుంది. అయితే.. ఈ డీల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఇరు వర్గాలు యుద్ద విరమణ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్ పై ఆంక్షల్ని తక్షణమే ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్మూజ్ ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ప్రపంచంలోని నౌకలు.. హర్ముజ్ లో ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. చమురు రవాణాను కొనసాగించండంటూ పేర్కొనటం గమనార్హం.
ట్రంప్ తో పాటు ఇరాన్ తరఫు ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్ కు ఇరు వర్గాలు థ్యాంక్స్ చెప్పాలి. డీల్ కుదిరిన విషయాన్ని పాకిస్తాన్ సైతం ప్రకటించింది. అంతేకాదు.. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేస్తాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే ట్రంప్ పుట్టిన రోజున ఇరు దేశాల మధ్య డీల్ కుదరిన విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక పోస్టులో పేర్కొన్నారు. తక్షణ యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం అమెరికా.. ఇరాన్ తో పాటు వాటి కూటమి దేశాల మధ్య అన్ని వైపులా (లెబనాన్ తో సహా) అన్ని సైనికదాడులు.. యుద్ధ కార్యకలాపాలు శాశ్వితంగా నిలిపివేస్తారని.. అవన్నీ తక్షణమే అమల్లోకి వస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు.. తక్షణమే హార్ముజ్ జలసంధి తెరుస్తున్నారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన కఠినమైన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ఖరారైన నేపథ్యంలో ఈ శుక్రవారం (జూలై 19న) జెనీవాలో ఇరు దేశాల ప్రతినిదులు అధికారికంగా ఈ శాంతిపత్రాలపై సంతకాలు చేస్తారు.
యుద్ధం ఆగినప్పటికి ఇరాన్ అణు కార్యక్రమం అమెరికా స్తంభించిన ఇరాన్ నిధుల విడుదల.. ఇరాన్ పై ఆర్థిక ఆంక్షల సడలింపు లాంటి కీలక అంశాలపై రాబోయే అరవైరోజుల పాటు జెనీవాలో తదుపరి చర్చలు మొదలవుతాయి.
ట్రంప్ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా నాలుగు శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. జెనీవాలో తదుపరి చర్చలు ప్రారంభం కావటానికి ముందే అమెరికా తన వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయిలు తక్షణం విడుదల చేయటానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. చర్చలు జరిగే రెండు నెలల వ్యవధి (60 రోజులు)లో మొత్తం 24 బిలియన్ డాలర్లు అంటే.. మన రూపాయిల్లో రూ.2 లక్షల కోట్లు విడుదల కానున్నాయి.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవటానికి అమెరికా.. దాని కూటమి దేశాల కనీసం 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికను అందించనున్నట్లు చెబుతున్నారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఎలాంటి యురేనియం ఎన్ రిచ్ మెంట్ చేయకూడదని. అణు కేంద్రాల్ని విస్తరించకూడదన్న షరతుకు అంగీకరించింది. ఈ ఒప్పంద ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ – లెబనాన్ సరిహద్దుల్లో దాడులు పూర్తిగా ఆగిపోయి.. తాత్కాలిక ప్రశాంతత నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇదే నిజమేతే.. నిజంగానే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates