ప్రాంతీయ పార్టీల్లో చాలా మటుకు.. కుటుంబ సభ్యుల ప్రమేయం కొనసాగుతోంది. ఇది ఆయా పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్.. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కుటుంబ సభ్యులే ఇబ్బందిగా మారుతున్నారు. అధికారంలో ఉండి.. ప్రభుత్వాలను కూలదోసుకునే పరిస్థితికి కూడా కారణమవుతున్నారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. వాస్తవానికి సీఎం స్టాలిన్‌మరోసారి విజయం దక్కించుకుంటారని మెజారిటీ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ.. డీఎంకే 57 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీనికి కారణం.. స్టాలిన్ కుమారుడు, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారణమన్నది బహిరంగ రహస్యం. ఆయన దూకుడు కారణంగానే పార్టీ ఓడిందని నేతలు ఇటీవల నివేదిక కూడా ఇచ్చారు.
ఇక, ప్రస్తుతం అధికారం కోల్పోయిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా సొంత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంట్లోనలుసుగా మారారు. ఆయన కారణంగానే పార్టీ ఓడిపోయిందని.. మెజారిటీ ఎమ్మెల్యే(ప్రస్తుతం గెలిచిన వారు)లు చెబుతున్నారు.
ఆయన ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక ఇటీవల 50 మంది ఎమ్మెల్యేలు చీలిపోయారు. అయితే.. మమతను వారు ఏమీ అనడంలేదు. కానీ అభిషేక్‌ను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. పోనీ.. అభిషేక్‌ను పార్టీ నుంచి సాగనంపుదామా? అంటే.. వేరేకుంపటి పెట్టుకుని అసలుకే ఎసరు పేట్టే యోచనలో బెనర్జీ ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, ప్రస్తుతం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లో జేఎంఎంలోనూ కుటుంబ వివాదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. జేఎంఎం చీఫ్, సీఎం హేమంత్ సొంత వదిన బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆమె సర్కారుపై అలుపెరుగని పోరు చేస్తున్నారు. మరిది ప్రభుత్వ అవినీతిని నిత్యం మీడియా ముందుకు తీసుకువస్తున్నారు. మంత్రుల నుంచి అధికారుల వరకు చేతులు తడపందే పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. బీహార్‌లో ఆర్జేడీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్.. తన చిన్నకుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత.. ఆయన వేరే కుంపటి పెట్టుకున్నారు. ఇదే.. గత ఎన్నికల్లో ఆర్జేడీకి శాపంగా మారింది.
బలమైన నియోజకవర్గాల్లో సొంత కుమారుడే లాలూకు, ఆయన పెద్ద కుమారుడు, ప్రస్తుత ఆర్జేడీ చీఫ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక, తెలంగాణలో బీఆర్ ఎస్ పరిస్థితి కూడా కుటుంబ రాజకీయ కలహాలతో కేసీఆర్ తనయ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. బీఆర్ ఎస్ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసే పనిలో ఆమె ఉన్నారు. ఇలా.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పరిస్థితి కుటుంబ రాజకీయాలతో అట్టుడుకుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates